ఔదార్యం చాటుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ నిన్నంతా వార్తలొచ్చాయి. మహ్మద్ సలీమ్ అనే వృద్ధుడిని మార్గమధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పలకరించడం… అక్కడికక్కడే ఆయనకి పెన్షన్, డబుల్ బెడ్ రూమ్ ఇంటిని మంజూరు చేయడంతోపాటు ఆయన కుమారుడికి కూడా సాయం చేయాలంటూ కేసీఆర్ చకచకా అధికారులకు ఆదేశాలు ఇచ్చేశారు. దీనిపై తనదైన శైలిలో స్పందించారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. తండ్రీ కొడుకులు డ్రామాలు ఆడుతున్నారంటూ కేటీఆర్, కేసీఆర్ మీద విమర్శలు చేశారు. ఓ ముసలవ్వ దగ్గరకి కేటీఆర్ వెళ్తే, ‘మీ అయ్యొచ్చి ఏం చెయ్యలేదు, నువ్వొచ్చి ఏం చేస్తవ్’ అంటూ ఆమె తిడితే.. మెచ్చుకుందని పత్రికల్లో రాయించుకున్నారన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కొడుకు తీరుగానే, దార్లో ఒక ముసలాయన కనిపిస్తే… సలీమ్ బాగున్నవా అని పలకరిస్తే… నాకు ఇల్లులేదు, పెన్షన్ లేదని ఆయన చెప్తే ఈయన ఇచ్చాడట అన్నారు. 57 ఏళ్లు నిండినవాళ్లందరికీ పెన్షన్లు ఇస్తానని ముఖ్యమంత్రే ఎప్పుడో చెప్పారనీ, ఇల్లు లేనివాళ్లందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లిస్తానని ఆయనే చెప్పాడనీ, ఆయన ముఖ్యమంత్రిగా ఆరేళ్లైనా సలీమ్ కి పెన్షన్ ఇయ్యలేదు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇయ్యలేదన్నారు. ఆరేళ్లు ఆలస్యం చేసినందుకు కేసీఆర్ ని కొరడా తీసుకుని కొట్టాల్సింది పోయి, ఆయన గొప్ప పని వెలగబెట్టాడంటూ పొగడ్తలు ఏంటన్నారు. మీడియా కూడా సోయి కోల్పోయిందనీ, ఆరేళ్లపాటు పెన్షన్, ఇల్లు ఇయ్యనందుకు ముఖ్యమంత్రిని కడగాల్సిన బాధ్యత లేదా అన్నారు. చెయ్యాల్సిన పని చేస్తే అది ఔదార్యం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ముందుగానే ఓ ముసలాయన్ని తయారు చేసి, ఆయన్ని రోడ్డు మీద పెట్టి ఇలా డ్రామాలు ఆడించారంటూ రేవంత్ ఆరోపించారు.
సలీమ్ రోడ్డుకి అడ్డమొస్తే ఇల్లు ఇచ్చావ్ కదా… ఇంతమంది ఆడబిడ్డలు పట్నం గోస యాత్రలో రోజూ రోడ్డు మీదికి వస్తున్నారన్నారు రేవంత్. వీళ్లకీ ఇళ్లు లేవనీ, వీళ్లందరికీ ఇస్తే కేసీఆర్ మొనగాడు అన్నారు రేవంత్. నాటకాలు ఆడటంలో తండ్రీ కొడుకులు పోటీలు పడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. సలీమ్ ఎపిసోడ్ ని… తాను చేస్తున్న యాత్రలోని ప్రధానాంశమైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు ముడిపెట్టారు రేవంత్. కేసీఆర్, కేటీఆర్ చర్యల్ని తెరాస గొప్పగా చెప్పుకుంటే… రేవంత్ ఇలా స్పందించారు! రేవంత్ ఘాటైన విమర్శలే చేశారు. దీనిపై అధికార పార్టీ నుంచి ఎవరైనా స్పందిస్తారో లేదో చూడాలి.