అసెంబ్లీ ఎన్నికల తరువాత టీజేఎస్ పార్టీ ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టలేదు. అలాగని, ఇతర పార్టీలు చేపట్టిన ప్రభుత్వ వ్యతిరేక విధానాల నిరసనల్లో కూడా పాల్గొన్నదీ లేదు! ఆ పార్టీ పెట్టిందే నిరుద్యోగులు, యువత కోసం అంటూ అప్పట్లో ప్రొఫెసర్ కె. కోదండరామ్ చెప్పారు. కానీ, వారి తరఫున నిరంతర పోరాటాలుగానీ, నిరసనలుగానీ, ఉద్యమాలుగానీ చేపట్టిందీ లేదు. ఇన్నాళ్లూ రాజకీయంగా కొంత మౌనంగా ఉంటూ వచ్చిన కోదండరామ్.. ఇప్పుడు నిరుద్యోగులతో ఉద్యమిస్తా అంటున్నారు. క్షేత్రస్థాయి నుంచి నిరుద్యోగ యువతతో ఉద్యమ కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
ప్రభుత్వోద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని ప్రభుత్వం ఎప్పుడో చెప్పిందనీ, ఇంతవరకూ ఏవీ భర్తీ కాలేదనీ, ఈ తీరుకి నిరసనగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తామని కోదండరామ్ ప్రకటించారు. నిరాహదీక్షలు, అసెంబ్లీ ముట్టడి లాంటి కార్యక్రమాలు వరుసగా ఉంటాయన్నారు. ప్రతీ గ్రామంలో పదిమంది నిరుద్యోగులతో కమిటీలు ఏర్పాటు చేస్తామనీ, ఆ కమిటీలన్నీ కలిసి స్థానిక ఎమ్మెల్యేలను కలుస్తాయన్నారు. వివిధ సంఘాలతో సమావేశాలు, విద్యా సంస్థల బందులు నిరసనలు ఆ కమిటీలు చేపడతాయన్నారు. రాష్ట్రంలో రాజకీయాలు బాగులేవనీ, నిరుద్యోగులను పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదనీ, పోరాడితే తప్ప నోటిఫికేషన్లు రావన్నారు కోదండరామ్.
నిరుద్యోగులతో గ్రామస్థాయి నుంచీ కమిటీలు వేయాలనే ఆలోచన మంచిదే. ఓరకంగా పార్టీ నిర్మాణానికి కూడా ఇది బాగా ఉపయోపడుతుంది. నిరుద్యోగ యువతకు బాసటగా నిలిచేందుకు ఇతర రాజకీయ పార్టీలు సిద్ధంగా లేవు. ఒకవేళ ఉన్నామని ప్రకటించినా… కోదండరామ్ ని నమ్మినంతగా ఇతర పార్టీలను నిరుద్యోగులు నమ్మే అవకాశమూ తక్కువే. కాబట్టి, సంస్థాగతంగా టీజేఎస్ ని బలోపేతం చేసే అవకాశం ఈ ఆలోచనలో కనిపిస్తోంది. నిరుద్యోగుల పక్షాన పార్టీ నిలుస్తుందనే భరోసా కల్పించగలిగితే… కోదండరామ్ పార్టీకి కొంత శక్తి పుంజుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఈ కమిటీలూ ఉద్యమాలూ భారీ స్థాయిలో నిర్మించాలంటే… దానికితగ్గ సాధనాసంపత్తితోపాటు, ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా కావాల్సి ఉంటుంది. కోదండరామ్ వ్యూహం ఎలా ఉందో చూడాలి?