” రెండు నెలల సమయం ఇస్తున్నాం. చానల్ లాభాల్లోకి రాకపోతే.. అరవై నుంచి ఎనభై మందిని ఇంటికి పంపేస్తాం..!” ఓ మెరుగైన చానల్ బోర్డ్ మీటింగ్‌లో… సంబంధిత చానల్ ఉన్నత ఉద్యోగులకు.. యాజమాన్యం నుంచి వచ్చిన హెచ్చరిక ఇది. సూటిగా సుత్తి లేకుండా.. ఇచ్చిన సందేశం. ఇటీవల జరిగిన బోర్డు మీటింగ్‌కు హాజరైన మెరుగైన చానల్‌కు చెందిన ఓ ఉన్నత వ్యక్తి తెలుగు360కి ధృవీకరించిన విశ్వసనీయమైన సమాచారం ఇది. ఆ మెరుగైన చానల్‌ను.. కొనుగోలు చేసిన వాళ్లు ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. వారికి కావాల్సింది లాభం మాత్రమే. నష్టాలొస్తే సహించే ప్రశ్నే లేదు. అచ్చంగా అదే పద్దతిని.. ఆ మెరుగైన చానల్ నిర్వహణకూ ప్రయోగిస్తున్నారు. సిబ్బందిలో అరవై నుంచి ఎనభై మందిని తగ్గించుకునే లక్ష్యంతోనే.. ఇలా హెచ్చరికలు జారీ చేశారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మెరుగైన చానల్… చేతులు మారక ముందు నెలకు రూ. పదిహేను కోట్ల వరకూ లాభం కళ్ల జూసేది. అది ఒక్కటే కాదు. ఆ గ్రూప్‌లో ఉన్న చానళ్లన్నీ లాభాల్లోనే ఉన్నాయి. ఒక్క హిందీ చానల్ మాత్రమే.. మినహాయింపు. కొత్తగా ప్రారంభించిన చానల్ కాబట్టి బ్రేక్ ఈవెన్ కోసం .. ఆ చానల్ ప్రయత్నిస్తోంది. అనూహ్యంగా.. యాజమాన్యం చేతులు మారిన తర్వాత తెలుగు చానల్ మాత్రం.. నష్టాల్లోకి వెళ్లిపోయింది. రేటింగ్స్‌లో పెద్దగా మార్పుల్లేవు. కానీ.. యాడ్ రెవిన్యూ మాత్రం పడిపోయింది. దీనికి కారణం ఆర్థిక మందగమన పరిస్థితులేనని.. ఓ వర్గం చెబుతోంది. ఆటోమోబైల్తో సహా కొన్ని కీలక రంగాల్లో మాంద్యం ప్రభావం స్పష్టంగా ఉండటంతో.. ఆయా రంగాల నుంచి వచ్చే ప్రకటనలు తగ్గిపోయాయి. ఈ ప్రభావం మెరుగైన చానల్‌పై పడిందంటున్నారు.
ఆ చానల్‌కు పాత సీఈవో ఉన్నప్పుడు ప్రొఫెషనలిజం ఉండేది. మార్కెట్లో తమ ప్రత్యేకత నిరూపించుకోాలని తాపత్రయ పడేవారు. మార్కెటింగ్ పరంగా కూడా.. ఎక్కడా నిర్లక్ష్యం ప్రదర్శించేవారు కాదు. కానీ.. ఆ సీఈవోను పంపేసిన తర్వాత కొంత మంది కీలక వ్యక్తుల్ని చానల్‌నుంచి పంపేయడం.. నిర్వహణలోనూ.. ప్రొఫెషనలిజం కొరవడంతో.. నష్టాల్లోకి కూరుకుపోయింది. పైగా.. జీతాలు ఖర్చు.. నిర్వహణ ఖర్చులు అంతకంతకూ పెంచుకుంటూ పోవడంతో.. సమస్య ఎక్కువయిందంటున్నారు. రెండు, మూడు నెలల్లో… నష్టాలు పోయి.. లాభాల్లోకి రాకపోతే మాత్రం.. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకూ.. గరిష్టంగా ఓ ఎనభై మందిని ఉద్వాసన పలకవచ్చని అంటున్నారు.