అమరావతికి మద్దతు ప్రకటించాలంటూ.. చిరంజీవి ఇంటిని ముట్టడిస్తారమని ఎవరు ప్రచారం చేశారో.. ఒక్కరంటే.. ఒక్కరు కూడా… మెగాస్టార్ ఇంటి దరిదాపులకు రాలేదు. కానీ అలా వస్తారేమో అన్న ఉద్దేశంతో.. చిరంజీవి ఇంటి వద్దకు పెద్ద ఎత్తున అభిమానుల్ని ఆర్గనైజ్ చేశారు. ఎంసీస్ క్రూ పేరుతో..కనీసం వంద మందిని చిరంజీవి ఇంటి వద్ద మోహరించారు. స్థానిక పోలీసులకు సైతం సమాచారం ఇవ్వడంతో వారు కూడా భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే.. ఉదయం నుంచి చూసినా.. ఎవరూ అక్కడ ధర్నా చేయడానికి రాలేదు. దాంతో చిరంజీవి ఇంటి ముందు ధర్నా అనేది ఉత్త ప్రచారమేనని తేలిపోయింది.
అమరావతి యువ జేఏసీ పేరుతో..సోషల్ మీడియాలో చిరంజీవి ఇంటి ముందు ధర్నా చేస్తామని కొంత మంది ప్రచారం చేశారు. దానికి అమరావతి జేఏసీ మద్దతు ఉందని అనుకున్నారు. అమరావతి జేఏసీ ఇంత వరకూ ఇలా.. ఇతరులు మద్దతివ్వాలని.. వారి ఇళ్ల ముందు ధర్నా కార్యక్రమాలకు పిలుపునివ్వలేదు. అయితే.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై వారు పెద్దగా స్పందించకపోవడంతో.. నిజమేనని అనుకున్నారు. రాను రాను ఈ ఇష్యూ పెద్దదైపోవడంతో… తాము ఎలాంటి ధర్నాకు పిలుపునివ్వలేదని… పైగా ఈ రోజు.. ఉద్యమ కార్యాచరణ కోసం రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నామని ప్రకటించారు.
అయినప్పటికీ.. ఎవరైనా ధర్నా కోసం వస్తారేమోనని.. చిరంజీవి క్యాంప్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. కొంత మంది అభిమానుల్ని పోగేసింది. ఎవరూ రాకపోయినా.. అభిమానులందరూ సాయంత్రం వరకూ అక్కడే గుమికూడి ఉన్నారు. చివరికి పోలీసులు వారిని కూడా అక్కడ్నుంచి తరిమేశారు. అదిగో పులి అంటే.. ఇదిగో తోక అన్న చందంగా సాగిన ప్రచారంతో… ఇదంతా జరిగిందన్న అభిప్రాయం టాలీవుడ్లో వ్యక్తమయింది. చివరికి చిరు ఇంటి చుట్టూ చేరింది ఫ్యాన్సే కానీ..అమరావతి ఉద్యమకారులు కాదని..నిట్టూర్చాల్సి వచ్చింది.