అసెంబ్లీ సమావేశాల్లో రైతుల సమస్యలపైనే ప్రధానంగా పోరాటం చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీర్మానించింది. హైదరాబాద్ లోని గాంధీ భవన్లో జరిగిన సమావేశానికి పార్టీ ప్రముఖ నేతలంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ… రైతుబంధు పథకం కింద సాయం ఎవరికి అందుతోందో, ఎవరికి అందట్లేదో తెలియడం లేదన్నారు. ఆ స్పష్టత ప్రభుత్వానికే లేదన్నారు. గత ఏడాది అక్టోబర్లో రబీ సీజన్ కి రైతు బంధు ఆర్థిక సాయం ఇచ్చారనీ, ప్రస్తుతం మార్చి నెల కూడా వచ్చేసిందనీ, కేవలం మూడెకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే ప్రస్తుతం సాయం అందిస్తామని ప్రభుత్వం చెబుతోందన్నారు. ఇంతకీ ఈ పథకంపై ప్రభుత్వ విధానమేంటనేది చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. విస్తీర్ణంతో సంబంధం లేకుండా అందరికీ సాయం అందిస్తామని చెప్పి, ఇప్పుడు మూడెకరాలున్న రైతులకు మాత్రమే పథకం వర్తింపజేసే విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారన్నారని నిలదీశారు.
ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ… పార్టీలో అంతర్గతంగా కాంగ్రెస్ నేతలంతా కొట్టుకున్నా, ప్రజా సమస్యల దగ్గరకి వచ్చేసరికి కలిసి పనిచేస్తామని వ్యాఖ్యానించడం విశేషం! ఇకపై రైతు సమస్యల అజెండాతోనే కాంగ్రెస్ ప్రధానంగా పోరాటాలు చేస్తుందన్నారు. అసెంబ్లీ, మండలిలో ఈసారి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామనీ, రైతుబంధు, రైతు బీమాలపై చర్చకు పట్టుపడతామన్నారు.
కాంగ్రెస్ నేతలతో సమస్య ఇదే! అంతర్గతంగా కొట్లాటలున్నాయని ప్రకటించాల్సిన అవసరం ఏముందిప్పుడు..? వారి ఐక్యత గురించి ఇలా ప్రకటించుకోవాల్సిన పనేముందిప్పుడు? ఆ మాట అన్నాక… ‘వారిలో వారికే పడటం లేదు, ఇక రైతుల సమస్యపై వారేం కొట్లాడతార’నే అపనమ్మకం ప్రజలకు పనిగట్టుకుని మరీ కల్పిస్తున్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో రైతుల సమస్యలే ప్రధాన అజెండా అన్నారు, మంచిదే. అయితే ఇదే సమయంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం కూడా సభలో పోరాడతామని, దాన్నీ ఒక ప్రముఖ అంశంగా ప్రస్థావిస్తామని చెప్పకపోవడం విశేషం. నిజానికి, ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే ఆస్కారం ఉన్న టాపిక్ ఇది. ఎంపీ రేవంత్ రెడ్డి ఇదే అంశమై ప్రధానంగా ఆయన నియోజక వర్గ పరిధిలో యాత్ర చేస్తుంటే… దానికి పరిగణనలోకి తీసుకోకుంటే ఎలా..? ముంజేతి కంకణానికి అద్దం ఎందుకూ అన్నట్టుగా, కాంగ్రెస్ నేతల మధ్య అనైక్యత గురించి ప్రత్యేకంగా ప్రకటించుకోవాల్సిన పనేముంది..?