ప్రభుత్వాలు ప్రజలను తమ కాళ్ల మీద తాము నిలబడేలా ప్రోత్సహించడాన్ని ప్రాథమిక లక్ష్యంగా పెట్టుకుంటాయి. అందుకే విభిన్న రకాల స్వయం సహాయక కార్యక్రమాలు, ఉపాధి పథకాలు, రుణాలు అందిస్తూ.. మహిళలు, యువతకు ప్రత్యేకంగా సాయం చేస్తూంటాయి. ఇందు కోసం.. వివిద రకాల కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. వాటికి బడ్జెట్లో ప్రత్యేకంగా కొంత కేటాయించి.. .ఆయా వర్గాల ప్రజలకు రుణాలు అందించడం ద్వారా.. వారి అభ్యున్నతికి సాయం చేస్తున్నారు. కానీ ఏపీ సర్కార్ అందుకు విభిన్నంగా వ్యవహరిస్తోంది. ఇలాంటి ఉపాధి రుణాలు ఇంక ఇవ్వాల్సిన అవసరం లేదని.. ఆపేయాలని ఆదేశాలిచ్చింది. ఇందుకు బదులుగా నేరుగా డబ్బులివ్వడమో.. లేదా.. కొత్త పథకాలు అమలు చేయడమో చేస్తామని అంటోంది.
ఎస్సీ, ఎస్టీ,, బీసీ, కాపు, బ్రాహ్మణ.. ఇలా ప్రతీ వర్గానికో కార్పొరేషన్ ఉంది. ఈ కార్పొరేషన్ల ప్రధాన లక్ష్యం… ఆయా వర్గాల్లోని యువతకు స్వయం ఉపాధి మార్గాలు చూపించడం. గత ప్రభుత్వంలో కాపు కార్పొరేషన్‌కు ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తే.. ఇందులో అత్యధికంగా.. ఆ వర్గం యువత వ్యాపారాలు చేసుకోవడానికి.. .ఉపాధి పొందడానికి రుణాలు అందించారు. ఇప్పుడు.. ప్రభుత్వం రూ. రెండు వేల కోట్లు బడ్జెట్లో కేటాయించినా.. ఇంత వరకూ.. ఎలాంటి రుణాలు మంజూరు చేయలేదు. ఒక్క కాపు కార్పొరేషన్‌కు మాత్రమే కాదు.. అన్ని కార్పొరేషన్లలోనూ ఇదే పరిస్థితి. కొంత మొత్తం కేటాయించి.. ఆ మొత్తాన్ని.. అమ్మఒడి పథకానికి మళ్లించేశారు. లెక్కల్లో వాటికి కొంత కేటాయించి..మళ్లించారని ఉంది కానీ.. నిజానికి అసలు కేటాయించలేదు.
ప్రతీ కులానికి ఓ కార్పొరేషన్ పెట్టి.. ఆ కార్పొరేషన్‌కు దండిగా నిధులు కేటాయించి… అందులో ఉన్న యువతను ఆర్థికంగా పైకి తీసుకు వచ్చే బాధ్యత తాను తీసుకుంటానని.. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభల్లో చెప్పారు. కార్పొరేషన్లు పెట్టడ అనేది ఖర్చు లేని పని కాబట్టి..ఆ పని చురుగ్గా చేశారు. కానీ వాటికి నిధుల కేటాయింపు… మాత్రం.. లేదు. చివరికి.. ఉపాధి రుణాలు కూడా నిలిపివేయాలని నిర్ణయించడం.. ఆయా వర్గాల ఉపాధి మార్గాలను దారుణంగా దెబ్బకొట్టడమే. తాత్కలికంగా వారికి ఆర్థిక సాయం చేస్తే.. అవి తాత్కలిక అవసరాలకే ఉపయోగపడతాయి కానీ.. జీవితంలో పైకి రావడానికి ఉపయోగపడవు. కానీ ప్రభుత్వం మాత్రం కొత్తగా ఆలోచిస్తోంది.