ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మార్చి నెల చాలా క్లిష్టంగా గడవబోతోంది. ఎందుకంటే… ఎన్ని అడ్డంకులు ఎదురైనా స్థానిక ఎన్నికలు మార్చి31లోపు పూర్తి చేయాల్సి ఉంది. అదే సమయంలో మార్చి 31కే బడ్జెట్‌ను కూడా ఆమోదింపచేసుకోవాల్సి ఉంది. ఇవి చేయాలంటే… అనేక రకాల అడ్డంకులు ప్రభుత్వానికి ఎదురొస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద సవాల్ గా మారింది. ఈ ఎన్నికలపై హైకోర్టు తీర్పు వెలువడాల్సి ఉంది. రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో వాదప్రతివాదనలు జరిగి హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. హైకోర్టు తీర్పు సానుకూలంగా వచ్చినపక్షంలో ఉగాదిలోపు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండగా టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రతిబంధకంగా మారాయి. ఒకవేళ మార్చిలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేకపోతే 14వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయే ప్రమాదం పొంచి ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ లు, పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు ప్రత్యేక అధికారుల పాలనలో నడుస్తున్నాయి. 14వ ఆర్థిక సంఘం గడువు 2020 మార్చి 31వ తేదీతో ముగిసిపోతుంది. 14వ ఆర్థిక సంఘం కింద ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయతీలకు 3 వేల 710 కోట్లు, పురపాలక సంఘాలకు, నగరపాలక సంస్థలకు ఒక వెయ్యి 400 కోట్ల రూపాయల నిధులు రావాల్సి ఉంది. మార్చిలోపు ఎన్నికలు నిర్వహించనిపక్షంలో ఈ నిధులు వచ్చే అవకాశం ఉండదు. అయితే హైకోర్టు తీర్పుపై స్థానిక సంస్థల ఎన్నికల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.
ఒకవేళ తీర్పు ఎలా వచ్చినా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నప్పటికీ, మరో ప్రధాన ప్రతిబంధకం ప్రభుత్వానికి ఎదురవుతుంది. టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించాల్సి ఉండటంతో విద్యాసంస్థలన్నీ ఈ పరీక్షల నిర్వహణలో బిజీగా ఉంటాయి. టీచర్లందరూ కూడా ఇన్విజిలేషన్ డ్యూటీలో ఉంటారు. అందువల్ల ఈ ప్రతిబంధకాన్ని అధిగమించేందుక్కూడా ప్రభుత్వం గ్రామ సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఇక మార్చి 31వ తేదీలోపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. బడ్జెట్ ఆమోదం పొందితేనే 2020-21 ఆర్థిక సంవత్సరం నిధుల వినియోగం అందుబాటులోకి వస్తాయి. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఇంకో వైపు విద్యార్థుల పరీక్షల కాలం ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి