రాజ్యసభ పదవులు వస్తాయని ఆశలు పెట్టుకున్న వైసీపీ నేతలకు.. తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నేరుగా వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలవడం.. ఆయనతో పాటు వచ్చిన పరిమళ్ నత్వానీని వైసీపీ తరపున రాజ్యసభకు పంపడానికి అంగీకారం జరిగిపోయిందనే ప్రచారం జరుగుతూండటమే దీనికి కారణం. ప్రస్తుతం ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ నాలుగూ వైసీపీకే దక్కనున్నాయి. సుదీర్ఘ కాలం నుండి పార్టీ కోసం పని చేసిన వారికి.. ఎన్నికల సమయంలో.. పార్టీ కోసం త్యాగం చేసిన వారికి.. రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులను జగన్ ఆఫర్ చేసి ఉన్నారు. శాసనమండలిని రద్దు చేయాలని తీర్మానం చేయడంతో.. వాటిపై ఆశలు పెట్టుకోవడం మానేశారు. వారిలో చాలా మంది రాజ్యసభ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు.
పార్టీ కోసం తెర వెనుక పని చేసిన పెద్దలు.. చాలా మంది రాజ్యసభ రేసులో ఉన్నారు. రాంకీ గ్రూప్ సంస్థల యజమానికి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి తో పాటు మరికొంత మంది పారిశ్రామికవేత్తల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వారికి తోడు.. రాజకీయ అవకాశాలు పొందలేకపోయిన మేకపాటి రాజమోహన్ రెడ్డి , మర్రి రాజశేఖర్ సహా.. అనేక మంది ఆశావహులు రాజ్యసభ సీట్ల కోసం ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో… బీద మస్తాన్ రావు లాంటి వాళ్లను.. రాజ్యసభ ఆఫర్‌తో టీడీపీ నుంచి వైసీపీలో చేర్చుకున్నారు. పండుల రవీంద్రబాబు వంటి మాజీ ఎంపీలు కూడా.. జగన్ అవకాశం ఇస్తాడని చూస్తున్నారు.
అయితే… చివరి నిమిషంలో సమీకరణాలు మారిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి., మూడు మాత్రమే.. వైసీపీకి అని.. ఒకటి.. బీజేపీకి లేదా.. వారి చాయిస్‌కు ఇస్తారని చెబుతున్నారు. ఆ చాయిస్ పరిమల్ నత్వానీనేని దాదాపుగా క్లారిటీ వచ్చింది. ముఖేష్ అంబానీని కానీ.. రిలయన్స్‌ను కానీ ఎప్పుడూ.. జగన్.. సన్నిహితంగా గుర్తించలేదు. ఇప్పుడు ఒక్క సారిగా ఇంత ఆప్యాయత చూపించారంటే.. కచ్చితంగా కారణం ఉంటుందని నమ్ముతున్నారు. ఎలా చూసినా… ఓ రాజ్యసభ ఆశావహుడికి మాత్రం నిరాశ తప్పదన్న ప్రచారం వైసీపీలో జరుగుతోంది.