తెలుగు నాట మరో బయోపిక్ సిద్ధం అవుతోంది. ఈసారి కరణం మల్లీశ్వరి జీవిత కథ తెరపై రాబోతోంది. సంజనా రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. కోన వెంకట్, ఎంవివి సత్యనారాయణ నిర్మాతలుగా వ్యవహరిస్తారు. ఈ బయోపిక్ విషయంలో తొలి అడుగు పడిపోయింది. ఇటీవల సంజనా రెడ్డి కరణం మల్లీశ్వరిని కలుసుకుని, స్క్రిప్టు మొత్తం వినిపించారు. అది మల్లీశ్వరికి నచ్చడం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారు. ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ చిత్రం కోసం చేతులు కలపబోతోంది. ఆ సంస్థ ద్వారానే ఈ చిత్రం బాలీవుడ్లో విడుదల కానుంది.
అయితే కరణం మల్లీశ్వరి పాత్ర కోసం ఎవరిని తీసుకుంటున్నారో ఇంత వరకూ తెలీలేదు. ఆ పాత్ర కోసం ఓ స్టార్ హీరోయిన్ని ఎంచుకోవాలని కోన వెంకట్ భావిస్తున్నాడు. తన దగ్గర లిస్టు మాత్రం చాంతాడంత ఉంది. అనుష్క దగ్గర్నుంచి రాశీఖన్నా వరకూ చాలామంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఒకరిద్దరు బాలీవుడ్ స్టార్ల పేర్లు కూడా ఈ జాబితాలో కనిపిస్తున్నాయి. బాలీవుడ్ నటి భూమి పడ్నేకర్ ని త్వరలోనే దర్శక నిర్మాతలు కలవబోతున్నారు.
కరణం, సంజనా ఇద్దరూ మంచి మిత్రులు. పైగా ఒకే ప్రాంతానికి చెందినవాళ్లు. కరణం మల్లీశ్వరి బయోపిక్ తీయాలని… ఆరేళ్లుగా ఆమెతో ప్రయాణం చేస్తూనే ఉంది. ఇప్పటికి అది సెట్ అయ్యింది. ప్రస్తుతం కరణం మల్లీశ్వరి ఢిల్లీలో ఉంది. త్వరలోనే ఆమె హైదరాబాద్ రాబోతోంది. వచ్చాక.. ఈ బయోపిక్‌పై ఓ అధికారిక ప్రకటన చేస్తారు.