తెలుగు సినిమా తొలిస్టార్ కమెడియన్ కస్తూరిశివరావ్ నటుడుగాక పూర్వం సినిమా థియేటర్లలో టికెట్లు చింపేవారు. తర్వాత టిక్కెట్లిచ్చే స్థాయికి ఎదిగి, తదనంతరం ప్రొజెక్టర్ ఆపరేటర్‌గా ప్రమోటయ్యారు.. అప్పుడు జరిగిన ఈ సంఘటన ఆయన జీవితంలో పెనుమార్పుకు కారణమైంది.. ఇక వివరాల్లోకెళ్తే..
శివరావ్ ప్రొజెక్టర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న రోజుల్లో.. థియేటర్ యజమాని ఓ పరభాషాచిత్రాన్ని కొనుక్కొచ్చాడు.. అది ఆరోజుల్లేనే స్పైసీ సినిమా. అందులో హీరోయిన్.. ఓ సన్నివేశంలో వెనక్కుతిరిగి జాకెట్ విప్పదీస్తుంది. ఆ సీన్ చూడ్డానికి జనాలు పోటెత్తారు. థియేటర్ యజమానేమో.. ఇంకొద్ది క్షణాల్లో ఆ సన్నివేశం వస్తుందనగా.. మెరుపువేగంతో తెర వెనక్కెళ్లి నిలబడేవాడు.. అలా వెనక్కెళ్లిచూస్తే ముందుభాగం కనిపిస్తుందని అతని ఆరాటం. కానీ ఎన్నిసార్లు అలా వెనక్కెళ్లినా అక్కడకూడా వీపే కనిపిస్తుండటంతో అతను తీవ్ర నిరాశకు లోనయ్యాడు. ప్రొజెక్టర్ ఆపరేటరైన శివరావ్ తనపై పగబట్టి కావాలనే ఇలా చేస్తున్నాడని అతనికి చిర్రెత్తుకొచ్చింది.. వీరావేశంతో ప్రొజెక్టర్ రూమ్‌కెళ్లి శివరావ్ని నిలదీశాడు.. ”నేను వెనక్కెళ్లగానే బొమ్మ తిప్పేస్తున్నావ్.. ఎలావుంది ఒళ్లు..” అని పటపటా పళ్లు కొరుకుతూ ప్రశ్నించాడు.. శివరావ్కి మతిపోయినంత పనైంది.. ”నేను తిప్పడమేంటండీ.. ఆ బొమ్మేఅంత..” అని ఆయన ఎంతచెప్పినా అతను వినలేదు.. కాదు కావాలనే చేస్తున్నావ్.. అని నిలదీశాడు. ”నువ్వెటెళ్లి చూసినా వీపే కనిపిస్తదయ్యా మగడా..” అని శివరావ్ ఎంతచెప్పినా వినకపోగా.. ‘డిస్మిస్’ అనేశాడు..
ఆ విధంగా యజమాని అమాయకత్వానికీ చపలచిత్తానికీ శివరావ్ ఉద్యోగం బలైపోయింది.. ఇక చేసేదిలేక బతుకుతెరువు వెతుక్కుంటూ మద్రాసు రైలెక్కారు.. స్టూడియోల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు.. ఎట్టకేలకు నటుడు అనిపించుకున్నాడు.. తర్వాత్తర్వాత తెలుగుసినిమా తొలి స్టార్ కెమెడియన్గా ఎదిగి..రేలంగి వెంకట్రామయ్యలాంటివారికే ఆదర్శంగా నిలిచాడు.