తెలంగాణలో మరోసారి పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ఈ మధ్య ఇక్కడి శాఖపై కూడా దృష్టిపెడుతున్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. వీలున్నప్పుడల్లా తెలంగాణ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదే తరహాలో తాజాగా సమావేశం జరిగింది. అయితే, ఈసారి గతం కంటే భిన్నంగా జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ నేతల్ని ప్రోత్సహిస్తూ, ఉత్సాహం నింపేలా ప్రతీసారీ మాట్లాడుతూ వచ్చిన చంద్రబాబు… ఈసారి నాయకులకు క్లాస్ తీసుకున్నారు. ఎల్. రమణతో సహా సీనియర్ నేతలందరి పనితీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు.
తాను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి వస్తున్నానని చెప్పినప్పుడే పార్టీలో హాడావుడి ఉంటుందనీ, మిగతా సమయాల్లో నేతలు అంత యాక్టివ్ గా కనిపించడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాను వచ్చినప్పుడల్లా హడావుడి చేయడం వల్ల పార్టీకి ఏరకంగానూ ఉపయోగపడదనీ, నాయకులంతా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. రాష్ట్ర నాయకత్వమంతా సమష్టిగా పనిచేయాలన్నారు. కమిటీల ఏర్పాటు ఎందుకు ఆలస్యమౌతోందని నాయకులను చంద్రబాబు ప్రశ్నించారు. పార్టీ కోసం పనిచేస్తున్నవారు చాలామంది ఉన్నారనీ, వారిని రాష్ట్ర నాయకత్వం ఎందుకు గుర్తించడం లేదని నిలదీశారు. బలమైన నాయకుల్ని మనం ఎందుకు తయారు చేసుకోలేకపోతున్నామన్నారు. చంద్రబాబు ఇలా ఆగ్రహంగా మాట్లాడేసరికి ఎల్. రమణ స్పందించి, అందరూ కలిసే నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ సందర్భంగా… తెరాసను చంద్రబాబు మెచ్చుకున్నారు! ఇక్కడ ప్రతిపక్షాలకు తెరాస గౌరవమిస్తోందనీ, ఆంధ్రాలో పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు.
నేతలకు చంద్రబాబు క్లాస్… ఇదేమీ కొత్త అంశం కాదు! అయితే, తెలంగాణలో పార్టీని చక్కదిద్దాలంటే ఆయనతో సహా అందరూ శ్రద్ధ తీసుకోవాలి. చంద్రబాబు ఎక్కువగా ఆంధ్రా వ్యవహారాలకే పరిమితమౌతూ… వీలు చిక్కినప్పుడు మాత్రమే ఇటొస్తున్నారు. కిందిస్థాయి నాయకత్వంలో కొత్త ఉత్సాహం రావాలంటే… పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఆయన కూడా ఇక్కడ కార్యకలాపాలు పెంచాలి. పార్టీ తరఫున సభలూ సమావేశాల్లో ఆయనే కీలక పాత్ర పోషించాలి. పార్టీ అంతర్గత సమావేశాలు తప్ప… ప్రజల తరఫున సమస్యలపై పోరాడిన సందర్భంగానీ, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తిన కార్యక్రమాలుగానీ ఏవీ ఇంతవరకూ పెద్ద ఎత్తున చేపట్టలేకపోయారు. అలాంటి కార్యక్రమాలు చంద్రబాబు వస్తే… పార్టీ శ్రేణులకు నమ్మకం పెరుగుతుంది. అప్పుడే కొత్త నాయకత్వమూ తెరమీదికి వస్తుంది. చంద్రబాబు కూడా ఇక్కడి పార్టీ వ్యవహారాలపై పూర్తి శ్రద్ధ తీసుకుంటున్నారనే భరోసా కిందిస్థాయి వరకూ పార్టీలోకి వెళ్లే చర్యలపై ముందుగా దృష్టి సారించాలి.