డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు – మిగతా అంశాల్లో ప్రతిపక్షాలకు విమర్శించే వీలు ఇవ్వడం లేదుగానీ, ఈ ఒక్క హామీ దగ్గరకి వచ్చేసరికి అధికార పార్టీ తెరాస తటపటాయించాల్సి పరిస్థితి రాబోయే రోజుల్లో వచ్చే అవకాశమే కనిపిస్తోంది. ఎందుకంటే, ఓపక్క ఇదే అంశాన్ని పెద్దది చేసి… ప్రతీరోజూ విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. అర్హులైనవారికి ఇళ్లేవీ అంటూ లెక్కలు తీస్తున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం తెరాసకు లేదు. రేవంత్ విమర్శలపై స్పందించి, ఆయనకి పొలిటికల్ మైలేజ్ ఇచ్చే పనులూ చెయ్యరు! కానీ, ఈ విమర్శలు మొదలైన తరుణంలో కొంత అప్రమత్తంగా ఉండే ప్రయత్నం మంత్రి కేటీఆర్ ప్రారంభించినట్టుగా కనిపిస్తోంది.
ఖమ్మంలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ… ఖమ్మంలో కాలువ ఒడ్డు మార్కెట్లో కాసేపు ఆగి, కూరగాయలూ పండ్లు అమ్ముకునేవాళ్లతో ముచ్చటించా అన్నారు. పూలు అమ్ముకుంటున్న శ్రీదేవి అనే అమ్మాయితో తాను మాట్లాడితే… పేదవాళ్లందరికీ కేసీఆర్ బాగా చేస్తున్నారన్నా అని ఆమె సంతోషంగా చెప్పిందన్నారు. అత్తమ్మకి పెన్షన్ వస్తోంది, పిల్లలు బడికి పోతున్నారు, అక్కడ సన్నబియ్యంతో వాళ్లకి మంచిగా భోజనం పెడుతున్నారు, బంధువుల ఇంట్లో ఆడబిడ్డ పెళ్లయితే కల్యాణ లక్ష్మి పథకం కింద పైసలు వచ్చాయని చెప్పిందన్నారు. ఇన్నొచ్చాయిగానీ, ఇంకో పని చేయాలని ఆమె అడిగిందనీ, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కావాలని కోరిందని కేటీఆర్ చెప్పారు. ఇక్కడే కేటీఆర్ జాగ్రత్త పడింది! ఆమె ఇల్లు కోరింది అంటే… ఇంకా ప్రభుత్వం ఇవ్వలేదు అనే సెన్స్ వస్తుంది కదా! వినగానే ఎవరికైనా అదే అనిపిస్తుంది. అందుకే, వెంటనే డైవర్ట్ చేయడానికి అన్నట్టుగా… ఇన్ని చేసిన ముఖ్యమంత్రి, ఇది మాత్రం ఎందుకు చేయలేరు, తప్పకుండా చేస్తారని కేటీఆర్ చెప్పారు. బిడ్డ పుట్టిన దగ్గర్నుంచీ, పెరిగి పెద్దై, చదువు నుంచి వృద్ధాప్యం వరకూ కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కేటీఆర్ ఏకరువుపెట్టారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో ఇది ముందుజాగ్రత్త ప్రయత్నంగానే కనిపిస్తోంది. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి అయినా ఈ హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేకపోతున్నారనే ప్రచారాన్ని ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్లేలోపుగా…. ఇన్ని చేస్తున్నారు, ఇదీ కేసీఆర్ చేస్తారులే అనే ధీమా ప్రజలకు కలిగించే ప్రయత్నంగా కనిపిస్తోంది. కేటీఆర్ ప్రసంగంలో గమనించాల్సింది ఏంటంటే… డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల టాపిక్ రాగానే, దాన్నుంచి సంక్షేమ పథకాలు, అక్కడి నుంచి అభివృద్ధి అంటూ ఇతర అంశాలపై చకచకా మాటలు మళ్లించేశారు!