” నాన్నను చంపింది రిలయన్స్ అంబానీ, చంద్రబాబులే..”
” బాబాయ్‌ను హత్య చేయించింది చంద్రబాబే..”
“కోడికత్తి దాడి చేయించింది కూడా చంద్రబాబే..”
“చంద్రబాబు బినామీ శేఖర్ రెడ్డి..”
” కేసులకు కారణంగా చంద్రబాబే..?
రాయిటర్స్‌లో వార్త దగ్గర్నుంచి పట్టుబట్టి మరీ తరలిస్తున్న అమరావతికి కారణం కూడా చంద్రబాబే. ఒక్క మాటలో చెప్పాలంటే… ప్రతీ దానికి కారణం చంద్రబాబే. అది హత్య అయినా… ఆర్థిక పరమైన ఇబ్బంది అయినా.. ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయానికైనా.. వేలు చంద్రబాబు వైపే వెళ్తుంది. ఇప్పటి నుంచి కాదు.. గత పదేళ్లుగా అదే జరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతీ దానికి చంద్రబాబునే కారణంగా చూపిస్తూ వస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నంత కాలం అది చంద్రబాబునూ బూచిగా చూపడం మానలేదు. ఆ ప్రచారం ఎంతగా సాగిందంటే.. చంద్రబాబు నిజంగానే.. అలా చేయించి ఉంటారని నమ్మేంతగా సాగింది. కానీ అధికారపక్షంలోకి వచ్చిన తర్వాత అవన్నీ రాజకీయ ఆరోపణలేనని.. కేవలం.. రాజకీయంగా దెబ్బతీయడానికి చేసినవేనని.. ఆ ఆరోపణలు చేసిన జగన్మోహన్ రెడ్డినే నిరూపిస్తున్నారు. చంద్రబాబుపై చేసిన తీవ్రమైన ఆరోపణల్ని.. ఒక్కొక్కటిగా తానే తేల్చేస్తున్నారు.
రిలయన్స్ అంబానీ భేటీతో జగన్ సమాజానికి ఇచ్చిన సందేశం ఏమిటి..?
బురద పూయడానికి అప్పనంగా ఉన్నాడని… ప్రత్యర్థి పార్టీపై .. ఆ పార్టీ నేతలపై రాజకీయ ఆరోపణలు చేయడం సహజమే. కానీ.. దానికో ప్రాతిపదిక ఉండాలి. అలాంటి ప్రాతిపదికలు లేకుండా.. చంద్రబాబుపై ఆరోపణలు చేయడం వైసీపీ నైజం. అలాంటి ఆరోపణలు తీవ్రంగా చేసిన విషయం.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదం కుట్ర అని అందులో చంద్రబాబు… ముఖేష్ అంబానీ కుట్ర ఉందని.. ఆరోపించడం. రెండు, మూడు సార్లు ఎన్నికలలో దీన్నే హైలెట్ చేశారు. జగన్ మీడియాలో ప్రచారం చేశారు. ఇది ఎంత విస్తృతంగా ప్రచారం జరిగిందంటే… నిఖార్సైన వైఎస్ ఫ్యాన్స్.. దాన్ని ఇప్పటికీ నమ్ముతున్నారు. కానీ.. అదే ముఖేష్ అంబానీ నేరుగా జగన్ తో భేటీ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. రహస్య మంతనాలు జరిపారు. జ్ఞాపికలు ఇచ్చి పంపించారు. దీన్ని చూసిన వారికి చాలా మందికి గతంలో చేసిన ఆరోపణలే గుర్తుకు వచ్చాయి. అంటే… జగన్మోహన్ రెడ్డి… రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థులపై ఇలా ప్రచారం చేయించారని నమ్మడం ప్రారంభించారు. దీన్ని డిఫెండ్ చేసుకోవడానికి వైసీపీ వద్ద సమాధానం లేదు. వారు ఏమీ చెప్పలేరు కూడా. ఇప్పుడు ముఖేష్ అంబానీనే తన తండ్రిని చంపించారనే పాత ఆరోపణలకు జగన్ కట్టుబడి ఉండే అవకాశం లేదు.
చంద్రబాబును బూచిగా చూపించి ఇంత కాలం రాజకీయం…!
వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగితే.. గుండెపోటుగా ప్రచారం చేశారు. హత్య అని బయటపడిన తర్వాత… వెంటనే.. చంద్రబాబు కుట్ర పన్ని హత్య చేయించారని నిర్మోహమాటంగా చెప్పడం ప్రారంభించారు. అంతకు ముందు జగన్‌పై విశాఖలో కోడికత్తి దాడి జరిగితే.. దాన్నీ చంద్రబాబుకు అన్వయించారు. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రిగా జగన్ పదవీ బాధ్యతలు చేపట్టి 9 నెలలు అయింది. చంద్రబాబును ఎలాగైనా జైలుకు పంపాలని.. ఓ రకంగా.. విచారణ సంస్థలన్నింటితోనూ ఓ రకంగా సర్కస్ చేయిస్తున్నారు. కానీ.. ఈ రెండు కేసుల్లో మాత్రం.. విచారణ చేయించడం లేదు. హత్యా రాజకీయాలకు పాల్పడినట్లుగా.. ఆరోపణలు చేసి.. నారాసుర చరిత్ర అంటూ… పెద్ద ఎత్తున కథనాలు రాసి.. ప్రసారం చేశారు.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కిక్కరుమనడం లేదు. అంటే.. ప్రజల్ని మోసం చేసినట్లేనా..?
చంద్రబాబుకు వరుసగా క్లీన్‌చిట్లు ఇచ్చేస్తున్న జగన్..!
చంద్రబాబుపై తాను చేసిన ఆరోపణల్ని జగన్మోహన్ రెడ్డి నిరూపించలేకపోవడం మాత్రమే కాదు.. ముఖేష్ అంబానీ లాంటివాళ్లతో భేటీల ద్వారా… తాను రాజకీయంగా ఎంతకైనా దిగజారిపోతానని చెప్పకనే చెప్పినట్లయింది. కుట్రపూరితంగా.. చంద్రబాబుపై ఏదో విధంగా అబద్దాలు ప్రచారం చేసి.. రాజకీయ లబ్ది పొందాలనే ఉద్దేశంతోనే.. జగన్ ఇంత కాలం.. రాజకీయ ఆరోపణలు చేసినట్లుగా.. తానే నిరూపిస్తున్నారు. ముందు ముందు ఈ విషయంలో.. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి రావొచ్చు. అప్పట్లో అన్నదానికి ఇప్పుడు చేస్తున్నదానికి పొంతనేమిటని ప్రజలు ఖచ్చింతగా ప్రశ్నించే రోజు వస్తుంది.