ఆంధ్రప్రదేశ్ డీజీపీకి హైకోర్టుతో పదే పదే చీవాట్లు తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొన్నటికి మొన్న.. ఓ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించారన్న కారణంగా డీజీపీని హైకోర్టుకు పిలిపించి..గట్టిగా మందలించిన న్యాయస్థానం..ఇప్పుడు మరోసారి ..హైకోర్టుకు రావాలని ఆదేశించింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును విశాఖలో అడ్డుకున్న ఘటనలో పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం… అడ్డుకుంటామని ప్రకటించిన వారిని ప్రోత్సహించి..చంద్రబాబునే అరెస్ట్ చేశారని… దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. మరోసారి డీజీపీని హైకోర్టుకు రావాల్సిందిగా ఆదేశించింది. పర్యటనకు ముందస్తు అనుమతి ఇచ్చిన పోలీసులు తర్వాత సెక్షన్ 151చట్టం కింద అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు.
అసలు ఈ సెక్షన్‌ను ఎలా అమలు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై… డీజీపీతో పాటు.. విశాఖ సీపీ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. విశాఖ సీపీ ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈనెల 12న కోర్టుకు హాజరుకావాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఆదేశించింది. చంద్రబాబును అరెస్ట్ చేయాడానికి ఏ విధంగా సీఆర్పీసీ 151 అమలు చేస్తారో డీజీపీ వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను పన్నెండో తేదీకి వాయిదా వేసింది.
పోలీసుల చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ.. అక్రమ నిర్బంధాలు చేస్తున్నారంటూ.. ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఓ కేసులో డీజీపీని నేరుగా హైకోర్టు పిలిపించి మందలించింది. మరో కేసులో.. పోలీసుల తీరుపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ఇప్పుడు.. మరోసారి డీజీపీని హాజరు కావాలని ఆదేశించింది. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ.. ఇతరుల్ని వేధిస్తున్నాన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్న తరుణంలో… హైకోర్టు స్పందన పోలీసువర్గాల్లో కూడా ఆందోళనకు కారణం అవుతోంది.