పింక్ సినిమాని పవన్ కల్యాణ్ తో రీమేక్ చేస్తున్నారంటే ఆశ్చర్యపోయినవాళ్లకంటే, అనుమానించినవాళ్లే ఎక్కువ. అమితాబ్ ఏజ్ ఏంటి? పవన్ గేజ్ ఏంటి? అన్నట్టే చూశారు. నిజానికి పింక్‌లో అమితాబ్ బచ్చన్ నట విశ్వరూపం చూసినవాళ్లెవ్వరికీ ఆ పాత్రలో పవన్ కల్యాణ్‌ని చూడడం ఇష్టం ఉండదు. ఎందుకంటే బిగ్ బీ ఇమేజ్ వేరు, ఆ పాత్ర వేరు, ఇక్కడ పవన్ కల్యాణ్ వేరు.
పవన్ అంటే మాస్. మాస్ అంటే పవన్. పవన్ డైలాలుగు, ఆయన మేనరిజం, ఆఖరికి శ్వాస తీసుకునే స్టైల్ కూడా మాసీగానే ఉండాలి. అభిమానులు అదే కోరుకుంటారు. పింక్ రీమేక్ లో పవన్ క్లాస్ గా కనిపిస్తాడేమో అని అందరి డౌటు. అసలు పింక్ రీమేక్‌కి పవన్ సూటవ్వడని… పవన్ డై హార్డ్ ఫ్యాన్సనుకున్నవాళ్లే భావించి ఉంటారు. కానీ… ఆ అంచనాలన్నీ ఒక్కసారిగా, ఒక్క లుక్‌తో తలకిందులైపోయాయి.
పవన్ పింక్ రీమేక్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. ఓ మంచం, తలకిందులు చేసిన కుర్చీ, చేతులో పుస్తకం.. నల్ల కల్లద్దాలు, గుబురు గడ్డం…. ఈ లుక్‌లో పవన్‌ని చూస్తే.. `ఆ మాస్ ఎక్కడికీ పోలేదు`అనిపిస్తుంది. సినిమా టైటిల్ కూడా వకీల్ సాబ్ అని ఫిక్స్ చేసేశారు. పవన్ అభిమానులకు ఈ లుక్ బాగా నచ్చి ఉంటుంది. ఎందుకంటే అది ఆయన రెగ్యులర్ పోజే. సినిమా సెట్స్‌లో పవన్ కనిపించే గెటప్ అదే. బహుశా సెట్లో పవన్ కూర్చునే విధానాన్నే దర్శకుడు కాపీ చేసి ఉండొచ్చు. పవన్ సెట్లోకి అడుగు పెట్టిన తొలి రోజు ఓ పిక్ బయటకు వచ్చింది. అందులో పవన్ స్టైల్‌గా రెండు చేతుల్లో ఫ్యాంటు జేబుల్లో దోపి నడుచుకుంటూ వెళ్లడం కనిపించింది. ఆ పిక్‌ని సైతం దర్శకుడు తెలివిగా లోగోలో వాడుకున్నాడు. మొత్తానికి పింక్ రీమేక్‌ని పవన్ ఫ్యాన్స్‌కి నచ్చేలా తీస్తున్నాం అనే సంకేతాన్ని ఈ లుక్‌తో చెప్పకనే చెప్పింది చిత్రబృందం. పవన్ రీ ఎంట్రీకి ఇది శుభారంభమే అని చెప్పుకోవాలి.