స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారు అంశంపై.. హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసింది.. మీ పార్టీ వారంటే..మీ పార్టీ వారని.. టీడీపీ, వైసీపీ పరస్పర విమర్శలు చేసుకోవడం ప్రారంభించాయి. విమర్శలు మాత్రమే కాదు.. బీసీ ద్రోహి మీరంటే.. మీరేనని.. ఘాటుగా తిట్లు కూడా అందుకుంటున్నారు. 59.85 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం… కుదురదని.. 50 శాతం లోపే రిజర్వేషన్లు ఇవ్వాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే.. రెండు రాజకీయ పార్టీలు రంగలోకి దిగిపోయాయి. ముందుగా సోషల్ మీడియా టీంలు.. ప్రచారం ప్రారంభించాయి. ఈ పిటిషన్లను.. బోయ రామాంజనేయులు, ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తులు వేశారు. ఈ ఇద్దరూ టీడీపీ నేతలంటూ… వైసీపీ నేతలు.. వారి సోషల్ మీడియా విభాగం ప్రచారం ప్రారంభించింది. ఆ వెంటనే బొత్స సత్యనారాయణ కూడా ప్రెస్మీట్ పెట్టి.. అదే ఆరోపణలు చేశారు.
వీరి దూకుడు ఇలా సాగుతూండగానే టీడీపీ కూడా రంగంలోకి వచ్చింది. బోయ రామాంజనేయులు, ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తులు వైసీపీ పార్టీ వారేనని ఫోటోలు విడుదల చేసింది. బోయరామాంజనేయులు తన ఊళ్లో పెట్టున్న ఫ్లెక్సీని.. ప్రతాప్ రెడ్డి… జగన్ తో దిగిన ఫోటోను.. టీడీపీ విడుదల చేసిది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 59శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామని ప్రచారం చేసి.. తమ పార్టీ వారితోనే కోర్టుకెళ్లేలా చేసి.. బడుగుల్ని ఘోరంగా మోసం చేశారని టీడీపీ ఆరోపణలు ప్రారంభించింది. టీడీపీ సోషల్ మీడియా విభాగం కూడా..ఆ పిటిషనర్లు ఇద్దరి ఫోటోలను విపరీతంగా సర్క్యూలేట్ చేయడం ప్రారంభించింది. రిజర్వేషన్ల తగ్గింపు వల్ల బీసీల్లో ఆగ్రహం వస్తుందని.. ఆ ఆగ్రహం తమ వైపు రాకుండా ఉండేందుకు రెండు పార్టీలు.. శక్తి వంచన లేకుండా.. ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటున్నాయి.
బోయ రామాంజనేయులు, ప్రతాప్ రెడ్డి.. ఇద్దరూ ఏదో ఓ రాజకీయ పార్టీకి చెందిన వారే. కానీ ఇప్పటికై.. వారిద్దరూ.. ఏ పార్టీకి చెందిన వారు కాదు. అన్ వాంటెడ్. కొన్ని రోజులు పోయాక.. వారు ఏ పార్టీ తరపున కోర్టుకెళ్లారో… ఆ పార్టీలోనే గుర్తింపు లభించవచ్చు. అప్పటి వరకూ గప్ చుప్..!