రిలయన్స్ వ్యాపార సామ్రాజ్య ప్రముఖులు పరిమళ్ నత్వానీ … తాను ఈ సారి ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికవబోతున్నట్లుగా .. పార్లమెంట్లో తనను కలిసిన మీడియా ప్రతినిధులకు చెప్పేశారు. మూడు రోజుల కిందట… ముఖేష్ అంబానీతో కలిసి… తాడేపల్లిలో జగన్ను పరిమళ్ నత్వానీ కలిశారు. ఆ సమయంలో… రాజ్యసభ సీటు అంశం చర్చకు వచ్చిందని… కూడా నత్వానీ చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అంగీకరించారో.. లేదో మాత్రం ఆయన చెప్పడం లేదు. అయితే.. అడిగి లేదనిపించుకోవడం.. రిలయన్స్ వంటి బడా ఇమేజ్ ఉన్న సంస్థలు.. వ్యక్తులకు ఇష్టం ఉండదు. పూర్తిగా ఓకే అయిన తర్వాతనే మర్యాదపూర్వకంగా వెళ్లి కలుస్తారు. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే.. పరిమళ్ నత్వానీ..ఏపీ కోటాలో… వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికవడం ఖాయమని చెప్పుకోవచ్చు.
పరిమళ్ నత్వాని ప్రస్తుతం జార్ఘండ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇండిపెండెంట్లు రాజ్యసభకు ఎన్నికయ్యే పరిస్థితి లేదు. ఇతర రాష్ట్రాల్లోనూ పరిస్థితి అంతే ఉంది. కానీ.. నత్వానీ మాత్రం రాజ్యసభకు వెళ్లాలన్న పట్టుదలతో ఉన్నారు. బీజేపీకి కూడా ఆయన ఆత్మీయుడే కాబట్టి.. ఏపీలో మంచి అవకాశం కనిపించింది. జగన్మోహన్ రెడ్డి ఓ రాజ్యసభ సీటును బీజేపీకి ఆఫర్ చేసి ఉన్నారు కాబట్టి… దాన్ని నత్వానీకి ఇవ్వడం ద్వారా కవర్ చేసుకున్నట్లే అవుతుంది.
అయితే.. ముఖేష్ అంబానీ రాష్ట్రంలో పెట్టుబడుల గురించి చర్చించడానికి వచ్చారని.. వైసీపీ వర్గాలు అదే పనిగా ప్రచారం చేస్తున్నాయి. భేటీ ముగిసి వెళ్లిపోయిన తర్వాత.. రిలయన్స్ నుంచి ఏపీలో ఫలానా చోట్ల పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నామని ప్రకటన చేయలేదు. కానీ నత్వానీ నుంచి మాత్రం… రాజ్యసభ సీటు గురించి చర్చించినట్లుగా చెబుతున్నారు. ఏ విధంగా చూసినా… నత్వానీని ఏపీ నుంచి రాజ్యసభకు పంపడం.. దాదాపు ఖాయమనుకోవచ్చు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఏమైనా మార్పులు జరగకపోతే.. నత్వానీ పేరే ముందుగా ఏపీ నుంచి ఖరారయిందని భావించవచ్చు.