తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంటేనే కలహాల కాపురం అనే ఇమేజ్ వచ్చేసింది. పార్టీకి దశాబ్దాల తరబడి సేవ చేస్తున్న నాయకులున్నా వారి మధ్య సమిష్టి తత్వం అనేది ఇప్పటికీ కనిపించని పరిస్థితి. ప్రస్తుతం, పార్టీకి కొత్త నాయకత్వం కావాలి. క్షేత్రస్థాయి నుంచి నాయకులందరూ కలిసికట్టుగా పార్టీని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది. అయినాసరే, ఇంకా ఎప్పటివో విభేదాలను మనసులో పెట్టుకుని వ్యవహరిస్తున్నారు! ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి మధ్య విభేదాలు తెలిసినవే. హుజూర్ నగర్ ఉప ఎన్నిక సమయంలో అభ్యర్థి ఎంపిక దగ్గర మొదలైన అభిప్రాయ భేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
రేవంత్ రెడ్డి చేస్తున్న యాత్రపై పార్టీలో ప్రత్యేకంగా చర్చ జరగడం లేదన్నది తెలిసిందే. రేవంత్ సొంత ప్రోగ్రామ్ గానే చూస్తున్నారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్ ఇళ్ల సాధనకు ఉద్యమిస్తాననీ, దీనికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుమతి కోరతానని కూడా రేవంత్ చెప్పారు. ఇదే అంశం ఉత్తమ్ దగ్గర కొందరు నేతలు ప్రస్థావించినట్టు సమాచారం. కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామీపై పోరాటం చేస్తే పార్టీకి మంచి మైలేజ్ వచ్చే అవకాశం ఉందని ఓ ప్రముఖ నేత అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. అయితే, దీనిపై ఉత్తమ్ నుంచి ఎలాంటి స్పందనా లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదే అంశం భట్టి విక్రమార్క దగ్గర కూడా ప్రస్థావనకు వచ్చిందనీ, ఆయన కూడా ముభావంగా ఉండిపోయారని పార్టీ వర్గాలు అంటున్నాయి. నిజానికి, భట్టి విక్రమార్కతో కూడా రేవంత్ రెడ్డి అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ ఇద్దరూ కలిసి ఒకే వేదికపై కనిపించిన సందర్భాలూ తక్కువే ఉన్నాయి. ఇవన్నీ ఒక కొలీక్కి రావాలంటే… ముందుగా పీసీసీ అధ్యక్షుడి నియాకం పూర్తవ్వాల్సిందే! అదైతే తప్ప నాయకుల మధ్య ఈ పొరపొచ్చాలు ఇప్పట్లో తీరేలా లేవు. హుజూర్ నగర్ ఉప ఎన్నికప్పుడు వచ్చిన తేడాలను ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉత్తమ్ కి ఏముంది..? పోనీ, ఉత్తమ్ ప్రతిపాదించిన అభ్యర్థిని ఆయన గెలిపించుకుని ఉన్నా, ఇంకా కొనసాగిస్తున్న ఈ పంతానికి కొంత అర్థమైనా ఉండేది. రాష్ట్ర అధ్యక్షుడి స్థానంలో ఉన్న ఆయనే ఇలా వ్యవహరిస్తుంటే పార్టీలో ఐకమత్యాన్ని పెంచాల్సిన బాధ్యత ఎవరు మీద ఉంటుంది..?