ఎంతైనా… అప్పటి తరం క్రమశిక్షణ, సమయ పాలన ఈ తరంలో చూడలేం. మరీ ముఖ్యంగా చిత్రసీమలో.అప్పట్లో ఏడింటికి షూటింగ్ అంటే… ఆరింటికల్లా హీరో, హీరోయిన్లు… ఇతర తారాగణం సెట్లో ప్రత్యక్షం అయిపోయేవారు. టాలీవుడ్లో ఏడింటికి షూటింగ్ ప్రారంభిస్తారని తెలిసి, బాలీవుడ్ వాళ్లు సైతం ముక్కున వేలేసకునేవారు. ఎందుకంటే అక్కడ పదైతే గానీ, `యాక్షన్`మొదలవ్వదు. అందుకే వాళ్లకు అంత వింత. కానీ.. ఇప్పుడు మనవాళ్లు బాలీవుడ్ ని సైతం మించిపోయారు. ఇక్కడా… పదైతే గానీ మన హీరోలకు మూడ్ రావడం లేదు. షూటింగ్ ఆలస్యంగా మొదలవ్వడం వల్ల… ప్రొడక్షన్ ఖర్చు విపరీతంగా పెరిగిపోతోంది. ఈ విషయం గురించే ఈమధ్య చిరంజీవి క్లాసు పీకారు. ఏడింటికి షూటింగ్ మొదలైతే… నిర్మాతలకు చాలా డబ్బులు మిగులుతాయని, లంచ్ బ్రేక్ విషయంలోనూ… హీరోలు బద్దకిస్తున్నారని, మధ్యాహ్నం మూడింటి వరకూ కార్ వానుల్లోనే గడిపేస్తున్నారని, వందల రోజులు సినిమా సెట్లోనే ఉండిపోవడం భావ్యం కాదని, అది ఆరోగ్యకరం అనిపించుకోదని, నిర్మాతలకు చాలా ఇబ్బందని… చాలా సీరియస్ విషయాలే మాట్లాడాడు చిరు.
చిరంజీవి సూచనలు పట్టించుకోవాల్సిన అవసరం ఉందని సీరియర్ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. యువ హీరోలంతా బద్దకాలు తగ్గించుకుంటే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పట్లో లంచ్ బ్రేకులో యూనిట్ సభ్యులంతా చెట్టు నీడన కూర్చుని హాయిగా మాట్లాడుకునేవారని, అందుకే యూనిట్ కి హీరోతో, హీరోతో యూనిట్కి మంచి అనుబంధం ఏర్పడేదని ఇప్పుడు మాత్రం గ్యాప్ రాగానే కార్ వ్యానుల్లో దూరిపోతున్నారని, అందుకే ఏ సినిమా షూటింగ్ అయినా సెట్ బయట పదుల కొద్దీ కార్ వానులు కనిపిస్తున్నాయని కాట్రగడ్డ వాపోయారు.
కానీ చిరు సూచనలు పట్టించుకునేదెవరు? ఇది హీరోల రాజ్యం. వాళ్లు చెప్పిన సమయానికే షూటింగ్ మొదలవుతుంది. వాళ్లకు మూడ్ బాగోలేకపోతే.. పేకప్ చెప్పేస్తారు. అందువల్ల నిర్మాతలకు ఎంత నష్టమో ఆలోచించరు. ఇక్కడ ఎవరి ఈగోలు వాళ్లవి. స్టార్ హీరోలతో సినిమా అంటే నిర్మాతలకు సంబరంగానే ఉంటుంది. కానీ అది పైపైన మెరుగులే. వాళ్ల అడుగులకు మడుగులు ఎత్తుతూ, వాళ్లని అనుక్షణం బుజ్జగిస్తూ, బతిమాలుతూ, సెట్లోనే స్వర్గ సుఖాల్నీ అందించడానికి అనుక్షణం తాపత్రయపడే నిర్మాతల కష్టాన్ని చూసేవాళ్లకే,.. అందులోని కష్టనష్టాలు అర్థం అవుతాయి.
ఈ విషయంలో నవతరం హీరోలు మారాల్సివుంది. సెట్లో వృధా చేసే ప్రతి రూపాయి విలువ వాళ్లకు అర్థం అవ్వాలి. ప్రొడక్షన్ కాస్ట్ని కంట్రోల్ చేసుకోవాలి. నిర్మాత చేతికి అందాల్సిన రూపాయి రాకుండా పోతే.. ఆ తప్పు హీరోలదీ, దర్శకులదీ అనే విషయం అర్థం అవ్వాలి. ఎందుకంటే నిర్మాత బాగుంటేనే పరిశ్రమ బాగుంటుంది. ఆ రోజులు రావాలని ఆశిద్దాం.