అమరావతి పోరాటం విషయంలో కొంత మంది పబ్లిసిటీ కోసం చేస్తున్న ప్రయత్నాలు.. ఉద్యమాన్ని కామెడీ చేస్తున్నాయి. కావేటి శ్రీనివాసరావు అనే వ్యక్తి తాను అంతర్జాతీయ న్యాయస్థానంలో పిటిషన్ వేశానని.. దాన్ని విచారణకు స్వీకరించినట్లుగా.. సమాచారం వచ్చిందని.. మీడియాకు ఓ లేఖను విడుదల చేశారు దీన్ని ధృవీకరించుకోకుండా.. మీడియా చానళ్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. అంతర్జాతీయ కోర్టుకు అమరావతి వివాదం వెళ్లిపోయినట్లుగా ప్రచారం చేసేయడం ప్రారంభించారు. కావేటి శ్రీనివాసరావు అనే వ్యక్తి.. అమరావతి విషయంలో అంతర్జాతీయ ఒప్పందాలు.. మానవహక్కులు ఉల్లంఘిస్తున్నారని అంతర్జాతీయ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్ తమకు అందినట్లుగా మాత్రమే .. సంబంధింత విభాగం నుంచి ఓ లేఖ వచ్చింది. తదుపరి తీసుకునే చర్యలపై సమాచారాన్ని అందిస్తామని తెలియపరిచింది. దానికే.. అంతర్జాతీయ కోర్టులో పిటిషన్ పడిందని.. ఇక అమరావతి ఉద్యమానికి తిరుగు ఉండదంటూ.. రచ్చ చేయడం ప్రారంభించారు. మీడియా కూడా ముందూ వెనుకా చూుకోకుండా ప్రచారం ప్రారంభించింది. ఏపీ ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బ అంటూ హడావుడి చేయడం ప్రారంభించారు. నిజానికి.. అంతర్జాతీయ కోర్టు.. రెండు దేశాల మధ్య ఏర్పడే వివాదాలను మాత్రమే.. పరిశీలిస్తుంది. వ్యాపార ఒప్పందాలు, మానవ హక్కుల ఉల్లంఘన వంటి అంశాలపై వివాదాలు… ఏవైనా.. చేపట్టాలంటే.. ఎన్నో నియమ నిబంధనలు ఉంటాయి.
అమరావతి లాంటి విషయాన్ని ఉత్తినే.. పిటిషన్ పంపారు కదా అని విచారణకు తీసుకోరు. ఆ విషయం తెలియదో… ఏదో ఓ లెటర్ ప్యాడ్ చూపించారు కదా.. అమరావతికి మద్దతుగా చొక్కాలు చింపుకుందామనుకున్నారేమో కానీ కొంత మంది రెచ్చిపోవడం ప్రారంభించారు. అమరావతి ఉద్యమాన్ని ఇది కామెడీ చేస్తుందనే అంశాన్ని మాత్రం గుర్తించలేకపోయారు.