ఆలస్యమైనా, తాను అనుకున్న హీరోనే పట్టుకోగలిగాడు పరశురామ్. గీత గోవిందం తరవాత దాదాపు రెండేళ్లు గ్యాప్ వచ్చింది పరశురామ్‌కి. ఈమధ్యలో మహేష్‌తో సినిమా చేద్దామనుకున్నాడు. ఓ కథ కూడా చెప్పాడు. కానీ వర్కవుట్ అవ్వలేదు. హీరోలెవరూ అందుబాటులో లేకపోవడంతో నాగచైతన్యతో సర్దుకున్నాడు. ఈసినిమా స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నప్పుడు.. మళ్లీ మహేష్ నుంచి పిలుపొచ్చింది. వంశీ పైడిపల్లి సినిమా పక్కన పెట్టేయడం వల్ల… అనుకోకుండా వచ్చిన గ్యాప్‌ని ఫిల్ చేయాల్సిన బాధ్యత పరశురామ్‌పై పడింది.
ఇప్పటికిప్పుడు మహేష్ కోసం పరశురామ్ కొత్త కథ రాయడం కష్టం. అందుకే పాత కథకే కాస్త రిపేర్లు చేస్తున్నాడట. ఇది వరకు మహేష్‌కి చెప్పి, నో అనిపించుకున్న కథనే కాస్త అటూ ఇటూ చేసి మళ్లీ ట్రాక్ ఎక్కించే పనిలో ఉన్నాడు పరశురామ్. `గతంలో నాకు చెప్పిన కథే చేద్దాం. కాకపోతే… ఈసారి నా దగ్గరకు వచ్చినప్పుడు డైలాగ్ వెర్షన్‌తో రండి`అని చెప్పాడట మహేష్. అందుకే ఈసారి శ్రీకారం నుంచి శుభం కార్డు వరకూ పక్కా బౌండెడ్ స్క్రిప్టుతోనే మహేష్ దగ్గరకు వెళ్లాలని డిసైడ్ అయ్యాడు పరశురామ్. మహేష్ సినిమా ఓకే అయిన పక్షంలో నాగచైతన్య సినిమాని కొన్నాళ్లు పక్కన పెట్టాల్సివస్తుంది. మరి చైతూ ఈ విషయంలో పరశురామ్‌కి ఎలా సహకరిస్తాడో చూడాలి.