తెలంగాణ భారతీయ జనతా పార్టీలో గ్రూపుల సమరం రోజురోజుకూ పెరుగుతోంది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని తమ వర్గం అంటే తమ వర్గానికే ఇవ్వాలంటూ రోజురోజుకూ డిమాండ్లు పెరుగుతున్నాయి. దీంతో అంతర్గతంగా గ్రూపుల కుమ్ములాటలు పెరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ అధిష్టానం వద్ద ఏ సీనియర్ నాయకుడితో తమకు సంబంధాలు ఉన్నాయో ఆ కమలం పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీ నాయకులు నానా తంటాలు పడుతున్నారు. పార్టీ అధ్యక్ష పదవిని బీసీ వర్గానికి చెందిన వారికే ఇవ్వాలని, అది కూడా ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ కే. లక్ష్మణ్ కొనసాగించాలని ఓ వర్గం గట్టిగా పట్టుపడుతోంది. పార్టీ మాజీ అధ్యక్షుడు, దివంగత వీ.రామారావు తర్వాత బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారికి అధ్యక్ష పదవి దక్కలేదని, ఇప్పుడు ఎమ్మెల్సీ రామచంద్రరావుకు పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టి బ్రాహ్మణులకు ప్రాధాన్యం కల్పించాలని ఆ వర్గం డిమాండ్ చేస్తోంది. దివంగత బండారు లక్ష్మణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా చేసినప్పుడు సమైక్య రాష్ట్రంలో దళితులు పార్టీ వైపు ఆకర్షితులయ్యారని, ఆయనను తప్పించిన తర్వాత ఆ వర్గం పార్టీకి దూరం అయిందని దళిత నాయకులు అంటున్నారు. ఆ లోటును భర్తీ చేయాలంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవిని దళిత నాయకుడికే ఇవ్వాలని ఆ వర్గం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వీరంతా విడివిడిగా అధిష్టానం పెద్దలను కలిసి ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నట్లు సమాచారం. అధ్యక్ష పదవి ఎంపిక కోసం పార్టీ అధిష్టానం పరిశీలక బృందాన్ని పంపించినా… ఇంకా ఎవరిని ఎంపిక చేయకపోవడం వెనుక ఈ కుమ్ములాటలే కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.