స్థానిక సంస్థల ఎన్నికల్లో 50శాతంలోపే రిజర్వేషన్లు ఉండాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో బీసీలకు రిజర్వేషన్లు తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు పొలిటికల్ స్కిట్స్ ప్రారంభించాయి. బీసీల రిజర్వేషన్ల తగ్గించాల్సిన పరిస్థితికి మీరంటే మీరే కారణమని ఒకరిపై ఒకరు నిందలేసుకోవడం ప్రారంభించారు. ఆయా పిటిషనర్లతో ఆయా పార్టీల నేతల దిగిన ఫోటోలతో రచ్చ ప్రారంభించారు. నిజంగా రెండు పార్టీలకూ… బీసీలకు న్యాయం చేయాలని.. వారికి తగినంతగా రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే.. ఖచ్చితంగా చట్టమో.. జీవోనో ఉండాల్సిన అవసరం ఏముంది…?
స్థానిక సంస్థల ఎన్నికలలో యాభై శాతం రిజర్వేషన్లకు పరిమితమైతే బీసీలకు రిజర్వేషన్ల శాతం తగ్గిపోతాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 176ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 59.85శాతం ఉంటే అందులో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు దక్కేవి. ప్రస్తుతం రిజర్వేషన్లు కుదించడం వలన బీసీలకు 24.15శాతం మాత్రమే రిజర్వేషన్లు వస్తున్నాయి. దీని వల్ల బీసీలు అన్యాయమైపోతారని.. రెండు పార్టీల్లోనూ ఏకాభిప్రాయం ఉంది. ఇద్దరిది ఒకటే డిమాండ్. బీసీలకు 34శాతం రిజర్వేషన్లు ఉండాలనేది వారి సంకల్పం. భిన్నాభిప్రాయమే లేనప్పుడు.. రెండు పార్టీలు… ఎలాంటి శషబిషలకు తావు లేకుండా.. ఆయా వర్గాలకు జనరల్ సీట్లలో అయినా… అవకాశాలు కల్పిస్తే.. సమస్య ఏముంది..?. ఆయా పార్టీల చిత్తశుద్ధిని నిరూపించుకున్నట్లు అవుతుంది కదా..!
రిజర్వేషన్లు యాభై శాతం ఖరారు చేస్తారు. అంటే.. యాభై శాతం సీట్లలో ఉన్నత కులాలే పోటీ చేయాలని అర్థం కాదు. ఆయా సీట్లలో బీసీ అభ్యర్థులను కూడా నిలబెట్టవచ్చు. ఏ వర్గాల వారినైనా నిలెబట్టవచ్చు. రిజర్వేషన్ లేదు కాబట్టి.. జనరల్ వారికే ఇస్తామని.. రాజకీయ పార్టీలు… అనుకుంటే… ప్రజల్ని మోసం చేయడమే. ఎందుకంటే.. బీసీలు జనాభాలో సగం ఉన్నారని.. వారికి దానికి తగ్గ రాజకీయ అవకాశాలు ఇవ్వాలని పట్టుబడుతోంది ఈ పార్టీలే. చట్టాలు చేసినా… జీవోలు జారీ చేసినా.. ఈ పార్టీలే. ఒకటి అధికారంలో ఉంటుంది..మరొకటి ప్రతిపక్షంలో ఉంటుంది. అయినప్పటికీ.. ఇద్దరూ బయటకు చెబుతున్నది ఒక్కటే. అలాంటప్పుడు… తాము బీసీలకు.. చట్టాలు, జీవోలు లేకపోయినా అవకాశాలు కల్పిస్తే ఎవరు అడ్డుకుంటారు..? అనుకున్నట్లుగా బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించకపోతే కేవలం రాజకీయ పరమైన వాదాలతో ప్రజల్ని మోసం చేయడానికి రెండు పార్టీలు ప్రయత్నించినట్లే లెక్క.