అమరావతి రాజధాని కోసం గడచిన రెండున్నర నెలలుగా పోరాటం చేస్తున్న రైతుల ఉద్యమానికి తెలంగాణలో ఉన్న విపక్షాలు ఏకం అవుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలుగుదేశం నాయకులను క్లాస్ తీసుకోవడంతో వారిలో కూడా చలనం వచ్చిందంటున్నారు. ఇప్పటికే అమరావతి రైతుల కోసం వారం రోజుల క్రితం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ మద్దతు పలికారు. ఆ సమావేశంలోనే మిగిలిన పక్షాలను కూడా కలిసి రాజధానిలో ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ పనిలో భాగంగా తెలంగాణలోని తెలుగుదేశం, కాంగ్రెస్ తో పాటు వామపక్షాల నాయకులు, ప్రజా సంఘాల వారితో త్వరలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో సీపీఐ నాయకుడు కె.రామక్రిష్ణ అమరావతి రైతుల పక్షాన పోరులో ఉధ్రతంగా పాల్గొంటున్పారు. అలాగే సీపీఎం నాయకులు మధుతో సహా మిగిలిన వారు కూడా అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్నారు. దీంతో తెలంగాణలో ఉన్న వామపక్షాల నాయకులు కూడా అమరావతి కోసం ఏర్పాటు చేసే జేఎసీలో భాగస్వాములుగా ఉంటామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. వారం రోజుల్లోగా విపక్షాలు, ప్రజా సంఘాల నాయకులతో అమరావతి రైతుల పక్షాన ఉద్యమించేందుకు రాజకీయ జేఏసీ ఏర్పాటు చేసే అవకాశాలున్నాయంటున్నారు. తొలి విడతగా కొత్తగా ఏర్పాటయ్యే రాజకీయ జేఏసీ అమరావతి వెళ్లి అక్కడ రైతులకు సంఘీభావం తెలియజేస్తారు. ఒకటి రెండు రోజుల్లో తెలంగాణ సీపీఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం, సీపీఐ నాయకుడు చాడ వెంకటరెడ్డిలతో ప్రొఫెసర్ కోదండరామ్, తెలుగుదేశం నాయకుడు ఎల్.రమణ సమావేశం అయ్యే అవకాశాలున్నాయంటున్నారు. వీరంతా కలిసి అమరావతి రైతుల పక్షాన కార్యాచరణ ప్రణాళికను కూడా తయారు చేసే అవకాశం ఉందని, హైదరాబాద్ తో సహా తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిరసర సభలు, సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో కూడా రాజధాని మార్పుపై ఏపీ ముఖ్యమంత్రికి సెగ తగిలేలా కార్యక్రమాలు చేపడితే పునరాలోచించే అవకాశం ఉంటుందన్నది వారి ఆలోచనగా చెబుతున్నారు.