రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ త్వరలో రానుంది. మరో రెండ్రోజుల్లో, అంటే ఈనెల 6 నుంచి నామినేషన్లు ప్రారంభమౌతాయి. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రెండు స్థానాలను తెరాస ఏకగ్రీవం చేసుకోవడం లాంఛనమే. కావాల్సినంత సంఖ్యాబలం తెరాసకు ఉంది. అయితే, ఆ రెండు స్థానాల నుంచి ఎవరిని రాజ్యసభకు ముఖ్యమంత్రి కేసీఆర్ పంపిస్తారనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. గడచిన రెండు రోజులుగా సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపైనే ఆయన సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 6 నుంచి నామినేషన్లు ఉండటం, అదే రోజున అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలుకావడంతో… ఈలోపుగా ఇద్దరి పేర్లను ఖరారు చేసి, ప్రకటించే అవకాశం ఉందని తెరాస వర్గాలు చెబుతున్నాయి.
ఈ రెండు స్థానాలకు ముగ్గురు పేర్లు సీఎం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. కేశవరావు, దామోదరరావు, గ్యాదరి బాలమల్లు… ఈ ముగ్గురిలో ఇద్దరికే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరోసారి తనకు ఛాన్స్ ఇస్తారనే ధీమాతో కేశవరావు మొదట్నుంచీ ఉన్నారు. అయితే, ఇప్పటికే ముగ్గురు బీసీలు రాజ్యసభకు వెళ్లారు. మరోసారి అదే కోటా అవకాశం ఉంటుందా అనే చర్చ ఉంది. ఇక, దామోదర్ కి రాజ్యసభ సీటు ఇస్తానని కేసీఆర్ ఎప్పుడో హామీ ఇచ్చారట. గతసారి పంపాలనుకున్నా… ఆయన స్థానంలో సంతోష్ కి అవకాశం దక్కింది. కాబట్టి, ఇప్పుడు కచ్చితంగా ఆయనకి అవకాశం ఉండొచ్చు. బాలమల్ల విషయానికొస్తే… ఉద్యమ సమయంలో కేసీఆర్ కి అండగా ఉన్నారు. గతంలోనే ఆయన్నీ రాజ్యసభకుగానీ, మండలికిగానీ ఎంపిక చేయాలని సీఎం ప్రయత్నించినా… సామాజిక సమీకరణల వల్ల కుదర్లేదు. ఇప్పుడు ఆయనకి న్యాయం జరుగుతుందనే ధీమాతో ఆయన ఉన్నారు.
అసలైన ఉత్కంఠ ఏంటంటే… కుమార్తె కవితను రాజ్యసభకు పంపిస్తున్నారా లేదా అనేది. కవిత పేరు ప్రధానంగా పరిశీలనలో లేనట్టే అని పార్టీ వర్గాలు అంటున్నా… చివరి నిమిషంలో కేసీఆర్ నిర్ణయం ఎలా ఉంటుందో తెలీదు. మొదట్నుంచీ రాజ్యసభ సీటు ఆశిస్తున్న పొంగులేటి పేరు కూడా చివరికి వచ్చేసరికి వినిపించకపోవడం విశేషం. ఇవాళ్ల, లేదా రేపట్లోగా రాజ్యసభ అభ్యర్థులపై కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.