అమరావతిలో రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూముల్ని ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై రైతులు కోర్టుకెళ్లారు. కోర్టు కూడా.. ఒప్పందం ప్రకారం.. భూములు అభివృద్ధి చేయకుండా… పంచే అధికారం ఎక్కడిదని ప్రశ్నించింది. ఈ పిటిషన్లపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. అయితే.. హఠాత్తుగా… తమ వాదన కూడా వినాలంటూ… ఆ తర్వాతే నిర్ణయం ప్రకటించాలంటూ… 450 పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ఇంత పెద్ద మొత్తంలో పిటిషన్లు దాఖలు చేసింది… ఇళ్ల స్థలాల లబ్దిదారులు. మంగళగిరి, దుగ్గిరాల ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారికి అమరావతి గ్రామాల్లో భూములిస్తామని ప్రభుత్వం చెప్పింది. తీసుకుంటామన్న అంగీకార పత్రాలు కూడా వారి దగ్గర నుంచి తీసుకుంది. వారందరి పేరుతో ఇప్పుడు పిటిషన్లు దాఖలయ్యాయి. తమకు నివేశన స్థలాలు లేవని ప్రభుత్వం ఇస్తానంటోంది కాబట్టి..ఈ విషయంలో.. తమ వాదన కూడా వినాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
లబ్దిదారుల పేరుతో.. ఇంత ఆర్గనైజ్డ్గా భారీ మొత్తంలో పిటిషన్లు దాఖలు కావడం… వ్యూహాత్మకమేనని రాజధాని రైతులు అనుమానిస్తున్నారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో ఇళ్లు లేని వారికి గత ప్రభుత్వం ఇళ్లు కట్టించింది. వాటి పంపిణీని ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసింది. ఇళ్లు కట్టించిన విషయాన్ని స్వయంగా అడ్వకేట్ జనరలే.. హైకోర్టుకు చెప్పారు. అంటే.. ఆయా గ్రామాల్లో… ఇళ్ల స్థలాలు కోరుకునే లబ్దిదారులు లేరు. ఇతర ప్రాంతాల వారికి ఇవ్వాల్సిందే. ఈ విషయంలో కొన్ని నియమ నిబంధనలు అడ్డుగా ఉండటంతో.. కొంత మంది పెద్దలు.. ఈ ప్లాన్ వేసినట్లుగా చెబుతున్నారు. రాజధానిలో పెద్ద పెద్ద నిర్మాణాలు వస్తాయని.. తమ భూములకు విలువ పెరుగుతుందని.. రైతులు అనుకున్నారు. కానీ వాటిని ఇళ్ల స్థలాలుగా ఇస్తూండటంతో.. రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వీరందరికీ పోటీగా.. పెద్ద ఎత్తున లబ్దిదారుల్ని… అమరావతికి చేర్చితే…బ్యాలెన్స్ అవుతుందని అధికార పార్టీ నేతలు.. వ్యూహాత్మకంగానే… మందడం సహా కీలక గ్రామాల్లో ఇళ్ల స్థలాల పేరుతో.. యాభై వేల మందికి పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించారని అంటున్నారు. ఇప్పుడు.. వారి పేరుతోనే .. హైకోర్టులో పిటిషన్లు కూడా వేస్తున్నారు. దీంతో.. లబ్దిదారులు… అమరావతి రైతుల మధ్య పోరాటం ప్రారంభమైనట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.