జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రాజకీయ పోరాటాలకు కాస్త విశ్రాంతినిచ్చి… సినిమాలు చేసుకుంటున్నారు. ఆయన సినిమా అప్ డేట్స్ మాత్రమే ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. జనసేన గురించి పెద్దగా వార్తల్లోకి రావడం లేదు. అయితే.. పవన్ లేని లోటు కనిపించకుండా.. జనసేన యాక్టివ్గా ఉందని నిరూపించేందుకు… ఆ పార్టీలో నెంబర్ టు పొజిషన్లో ఉన్న నాదెండ్ల మనోహర్ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ఉత్తరాంధ్ర విస్తృతస్థాయి జనసేన సమావేశాన్ని నిర్వహించిన ఆయన.. అధికార పార్టీ భూదందాలపై.. పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. విస్తృత స్థాయిసమావేశంలో ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల ప్రతినిధుల నుంచి ప్రధానంగా భూ మాఫియాపైనే ఫిర్యాదులు వచ్చాయి. ఎక్కడిక్కడ వైసీపీ నేతలు.. భూములు ఆక్రమిస్తున్నారని.. కొన్ని సాక్ష్యాలు కూడా తీసుకొచ్చి నాదెండ్ల మనోహర్ ముందు ఉంచారు.
దీంతో.. వారం, పది రోజుల పాటు.. మరింతగా పరిశోధన చేసి.. విశాఖ చుట్టుపక్కల వైసీపీ నేతలు చేసిన భూదందాలన్నింటినీ సేకరించి.. ఆ తర్వాత ప్రత్యక్ష పోరాటానికి దిగాలనే ఆలోచన చేస్తున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు దిశానిర్దేశం చేశారు. విశాఖ చుట్టుపక్కల భూసమీకరణ పేరుతో.. చాలా పెద్ద స్కాం జరిగిందని.. దానికి సంబంధించిన వివరాలన్నీ బయటకు లాగాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. ఆ తర్వాత ప్రత్యక్ష పోరాటంలోకి దిగే అవకాశం ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ.. ఈ భూదందాలపై పోరాటానికి ప్రయత్నించింది. వైసీపీ నేతలు అడ్డగోలుగా కబ్జాలకు పాల్పడ్డారని.. విశాఖ నడిబొడ్డున.. వాటి గురించి బయటపెడతానని వచ్చిన టీడీపీ అధినేతను.. వ్యూహాత్మకంగా విశాఖలోకి రానివ్వకుండా చేశారు.
దీనిపై పెద్ద వివాదం అవుతోంది. ఈ సమయంలో.. జనసేన కూడా.. విశాఖ భూదందాలనే హైలెట్ చేయాలని నిర్ణయించుకోవడం ఆసక్తికరంగా మారుతోంది. కుదిరితే పవన్ కల్యాణ్ కూడా.. ఈ ప్రత్యక్ష పోరాటంలోకి దిగే అవకాశం ఉందని.. జనసేన వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే.. విశాఖ భూపోరాటం.. మరో రేంజ్కి వెళ్లే అవకాశం ఉంది.