చైనా తదితర దేశాల ను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ హైదరాబాద్ లో కూడా ప్రవేశించింది. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో వైరస్ బాధితులకు చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ రోజు అంటే మార్చి 4న హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతం లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలో కరోనా వైరస్ కారణంగా కంపెనీ యాజమాన్యం ఉద్యోగులకు సెలవు ఇచ్చి ఇంటికి పంపింది వివరాల్లోకి వెళితే..
మైండ్ స్పేస్ ఆవరణం లో ఉన్న బిల్డింగ్ నెంబర్ 20 లో ఉన్న డీఎస్ఎమ్ కంపెనీ లో పనిచేసే ఒక ఉద్యోగి కి ఇవాళ ఉదయం కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. రెండు మూడు రోజుల కిందటే ఆ ఉద్యోగి, కంపెనీ యాజమాన్యానికి తన ఆరోగ్య పరిస్తితి గురించి, కరోనా వైరస్ ఆనవాళ్లు గురించి సమాచారం ఇచ్చి ఉన్నాడు. దీంతో వైరస్ నిర్ధారణ అయిన మరుక్షణం కంపెనీ తన ఉద్యోగులకు సమాచారం ఇచ్చింది. ఉద్యోగులందరినీ తక్షణమే బిల్డింగ్ ఖాళీ చేయించింది. వీలు కుదిరిన వారు వర్క్ ఫ్రొం హోమ్ చేసేటట్లుగాను, మిగిలిన వారు సెలవులో ఉండేట్లుగా ను కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కంపెనీ పంపిన ఈ మెయిల్ లో, పూర్తి బిల్డింగ్ ని తమ సిబ్బంది డిస్ ఇన్ఫెక్ట్ చేస్తున్నారని, అది పూర్తయినట్లు సమాచారం ఇచ్చే వరకు ఉద్యోగులు ఎవరు ఆఫీసుకు రావద్దని పేర్కొంది. అయితే వైరస్ సోకిన ఉద్యోగి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గానే ఉందని చెప్పుకొచ్చింది.
మొత్తానికి లక్షలాది మంది ఉద్యోగులు పనిచేసే ఐటీ కారిడార్లో కరోనా వైరస్ సోకింది అనే వార్త హైదరాబాదులో, ఆ ఉద్యోగుల తాలూకు కుటుంబ సభ్యులు ఉన్న తెలుగు రాష్ట్రాలలో కలకలం సృష్టించింది.