తెలుగుదేశం పార్టీ నుండి బీజేపీలో చేరిన తర్వాత సుజనా చౌదరి కాస్త బలం పుంజుకున్నట్లుగా కనిపించారు. ఏపీ బీజేపీలో ఆయనే చక్రం తిప్పుతారని అందరూ అనుకున్నారు. కొన్ని రోజులు ఆ హడావుడి కనిపించింది కూడా. ఆయన వారాంతాల్లో ఏపీకి రావడం.. అనేక అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందించడం.. చాలా వేగంగా జరిగింది. అదే సమయంలో.. అమరావతి విషయంలో ఆయన చేసిన దూకుడైన ప్రకటనలు.. చాలా మందిని ఆకట్టుకున్నాయి. అమరావతిని తరిలిస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదని.. చేసిన హెచ్చరికలు కూడా… హైలెట్ అయ్యాయి. అయితే.. ఒక్క సారిగా ఆయన సైలెంటపోయారు. పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. ఏపీకి కూడా రావడం లేదు. వచ్చినా.. ప్రెస్‌మీట్లు లాంటివేమీ పెట్టడం లేదు. ప్రభుత్వంపై.. విమర్శలు ఎక్కు పెట్టడం లేదు.
ఏపీకి సంబంధించి భారతీయ జనతా పార్టీ వ్యవహారాల్లో కూడా ఆయన ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. పవన్ కల్యాణ్‌తో పొత్తు వ్యవహారంలో… సుజనా చౌదరి పాత్ర పరిమితంగానే ఉంది. నిర్ణయాల్లోనూ సుజనా ముద్ర కనిపించడం లేదు. ఇలా ఎందుకు జరుగుతోందనేదానిపై.. రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. తమపై దూకుడుగా.. సుజనా చౌదరి చేస్తున్న విమర్శలను.. వైసీపీ హైకమాండ్ బీజేపీ.. పెద్దల దృష్టికి తీసుకెళ్లి.. ఆయన దూకుడును తగ్గించేలా.. సూచనలు పంపించడంలో సక్సెస్ అయ్యారన్న ప్రచారం బీజేపీలోని ఓ వర్గంలో జరుగుతోంది. ఔనన్నా.. కాదన్న.. ప్రస్తుతం బీజేపీకి.. వైసీపీ అప్రకటిత మిత్రపక్షంగా ఉంది. సుజనా చౌదరి.. టీడీపీకి లాభం చేకూర్చే ఎజెండాతో తమపై విమర్శలు చేస్తున్నారన్న కోణంలో బీజేపీ హైకమాండ్‌కు.. తమ వెర్షన్ వినిపించి.. ఆయనను కట్టడి చేయడంలో… వైసీపీ ముఖ్యనేతలు సక్సెస్ అయ్యారంటున్నారు.
అమరావతి రైతులకు న్యాయం చేయలేకపోతే.. ఈ పదవులు ఎందుకని.. ఓ సారి.. సుజనా చౌదరి ప్రకటించారు కూడా. అప్పటికి.. ఇప్పటికి పరిస్థితి మరింత దిగజారింది కానీ.. రైతులకు ఏ మాత్రం.. భరోసా లభించలేదు. రైతు ప్రతినిధులకు.. జేఏసీ నేతలకు.. ఢిల్లీలో అపాయింట్‌మెంట్లు కూడా.. టీడీపీ నేతలు ఇప్పిస్తున్నారు కానీ.. సుజనా చౌదరి పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. దీంతో.. ఇక సుజనా చౌదరి చల్లబడినట్లనని.. బీజేపీలోనూ.. ఆయన ఇక పెద్దగా ప్రాధాన్యం లేదని.. ఓ వర్గం ప్రచారం కూడా ప్రారంభించింది.