ఊరూపేరూ లేని కంపెనీల దగ్గర్నుంచి జే ట్యాక్స్ వసూలు చేస్తూ.. పిచ్చి బ్రాండ్ల మద్యాన్ని అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని.. ఏపీ ప్రభుత్వంపై టీడీపీ విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో.. అసలు ప్రధానమైన బ్రాండ్లు ఎందుకు అమ్మడం లేదంటే.. ఎక్సైజ్ మంత్రి… విభిన్నమైన కారణాలు చెబుతున్నారు. అదేమిటంటే.. ఆయా కంపెనీలకు బాకీ ఉండటం. ప్రముఖ బ్రాండ్లు తయారు చేసే కంపెనీలకు ప్రభుత్వం రూ. 1700 కోట్లకుపైగా బాకీ ఉంది. ఈ సొమ్మును చెల్లించడానికి ప్రభుత్వం వద్ద సొమ్ము లేదని.. అందుకే అవి సరఫరా నిలిపివేశాయని మంత్రి చెబుతున్నారు. మరి ఎప్పుడు చెల్లిస్తారంటే.. ప్రపంచబ్యాంక్ నుంచి రుణం తీసుకుని చెల్లిస్తామని వెటకారం చేస్తున్నారు మంత్రి. ప్రపంచబ్యాంక్ మద్యం బకాయిలు చెల్లించడానికి.. అప్పులివ్వదని.. మంత్రిగా ఉన్న నారాయణస్వామికి తెలియదనుకోలేం.
ప్రముఖ డిస్టిలరీలు ప్రభుత్వానికి సరుకును సప్లయ్ చేశాయి. వాటిని ప్రభుత్వం అమ్మేసుకుంది. కంపెనీలు ప్రభుత్వానికి రూ. 1700 కోట్ల సరుకును సప్లయ్ చేశాయి అంటే.. అన్ని రకాల పన్నులు వేసుకుని… ప్రభుత్వం ఆ సరుకును దాదాపుగా రూ. పది వేల కోట్లకు అమ్ముకుని ఉంటుంది. అంత లాభానికి ప్రభుత్వం అమ్ముకుంటుంది. కానీ.. డిస్టిలరీలకు కట్టాల్సిన రూ. 1700 కోట్లు కట్టలేదు. అవి కట్టకుండా.. వేరే బ్రాండ్లకు ఆర్డర్స్ ఇస్తోంది. అవి ఊరూపేరూ లేని బ్రాండ్లు. ఎక్కడ తయారు చేస్తారో తెలియదు. వాటిలో ఏం కలుపుతారో తెలియదు. ఓ రకంగా.. ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టడమే. అయినా ఆ లిక్కర్ కంపెనీలకు ఇండెట్లు పెడుతున్నారు… డబ్బులు చెల్లిస్తున్నారు. ప్రముఖ బ్రాండ్లను మాత్రం.. దూరంగా పెడుతున్నారు.
ప్రభుత్వం తీరు ఇలా ఉండబట్టే.. విపక్ష పార్టీల నేతలు.. జే ట్యాక్స్ పేరుతో విమర్శలు చేస్తున్నారు. నెలకు ఆయా చీప్ బ్రాండ్లు ఉత్పత్తి చేసే కంపెనీల నుంచి రూ. 350 కోట్లు ముడుపులుగా అందుతున్నాయని.. అందుకే.. వాటిని మాత్రమే కొనుగోలు చేసి మద్యం దుకాణాల్లో అందుబాటులో ఉంచుతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వారిపై ఎంత ఎదురుదాడి చేసినా.. ఈ విషయంలో… ఇబ్బంది కర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తోంది.