స్థానిక ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు వస్తే… మంత్రులకు పదవులు ఐదు నిమిషాల్లో ఊడిపోతాయని.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. తేల్చి చెప్పేసారు. మంత్రివర్గ సమావేశంలో ఎజెండా అంశాలు పూర్తయిన తర్వాత మంత్రులకు సీఎం కర్తవ్యబోధ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత ఇన్చార్జ్, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు. జిల్లాలో పార్టీ నేతల మధ్య గ్రూపు తగాదాలను చక్కదిద్దాలని.. వాటి ప్రభావం ఎన్నికలపై లేకుండా చసుకోవాలన్నారు. ఫలితాల్లో తేడా వస్తే మంత్రులు రాజీనామా చేయాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో స్థానిక ఫలితాలు తేడాగా వస్తే.. వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చేది ఉండదని తేల్చేశారు.
నోటిఫికేషన్ వచ్చే వరకూ ఎదురుచూడొద్దని.. వెంటనే వెళ్లి.. ఎన్నికల సన్నాహాలు చేసుకోవాలని సూచించారు. తొమ్మిదో తేదీన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని జగన్ చెప్పకనే చెప్పారు. ఈ నెల 9 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందన్నారు. స్థానిక ఎన్నికల బాధ్యతలను.. మంత్రులు, ఎమ్మెల్యేల మీద పెట్టడంలో.. వైఎస్ ఫార్ములానే జగన్ ఫాలో అవుతున్నారు. వైఎస్ కూడా గతంలో.. స్థానిక ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు వచ్చాయని ఇద్దరు మంత్రుల్ని తొలగించారు. వారిలో ఒకరు.. మాజీ ఎంపీ మాగంటి బాబు.
తన తొమ్మిది నెలల పాలనపై రిఫరెండంగా భావిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఎట్టి పరిస్థితుల్లోనూ.. 151 సీట్లకు తగ్గ ఫలితాలు సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. లేకపోతే.. తాను తీసుకున్న నిర్ణయాలపై ప్రజా వ్యతిరేకత ఉందన్న అభిప్రాయం పెరిగిపోతుందన్న అంచనాలో ఉన్నారు. అందుకే.. మంత్రులు, ఎమ్మెల్యేల మెడపై కత్తి పెట్టేశారు.