మాజీ కేంద్రమంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్‌గజపతిరాజుకు ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. రాజకుటుంబానికి చెందిన మాన్సాస్ ట్రస్ట్ ధర్మకర్తగా ఆయనను తొలగించింది. రాత్రికి రాత్రే రహస్య జీవో ద్వారా.. పూసపాటి ఆనందగజపతిరాజు తొలి భార్య ఉమాగజపతిరాజు కుమార్తె, ఢిల్లీలో బీజేపీ నేతగా ఉన్న సంచితా గజపతిని మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ నియమించింది. వెంటనే ప్రమాణస్వీకారం కూడా చేయించేసింది. అశోక్ గజపతిరాజును తొలగిస్తున్నట్లు.. సంచితను చైర్మన్‌గా నియమిస్తున్నట్లుగా గంట ముందు వరకు కూడా మాన్సాస్ ట్రస్ట్ సిబ్బందికి సైతం తెలియదు. ఈ మేరకు జారీ చేసిన జీవోను సైతం బయటకు రానివ్వలేదు.
సంచితా గజపతి ప్రమాణస్వీకారం ముందు వైసీపీ నేతలు.. ఆమెతో సమావేశమయ్యారు. అది మర్యాదపూర్వక సమావేశమేనని ప్రచారం చేశారు. కోటను పరిశీలిస్తున్నట్లుగా కాన్వాయ్‌గా కోటలోకి వెళ్లారు. ట్రస్ట్ కార్యాలయంలోకి వెళ్లి హఠాత్తుగా ప్రమాణస్వీకారం చేయించేశారు. కోటలో ఛైర్మన్ కు ఉన్న కార్యాలయం, బంగ్లాను ఆమెకు స్వాధీనం చేశారు. గజపతిరాజుల కుటుంబానికి చెందిన మాన్సాస్ ట్రస్ట్‌కు దేశంలోని అనేక ప్రాంతాల్లో వేల కోట్ల ఆస్తులున్నాయి. 13 వేల ఎకరాలకు పైగా భూములుంటాయని అంచనా. ఆస్తులపై వచ్చిన ఆదాయంతో అనేక విద్యా సంస్థలు నడుస్తున్నాయి. రెండేళ్ల క్రితం ఆనందగజపతిరాజు మరణించిన తరువాత ఆయన సోదరుడు అశోక్ గజపతిరాజు వంశపారంపర్య ధర్మకర్తగా బాధ్యతలు స్వీకరించారు.
అశోక్ కుమార్తె ట్రస్టు బోర్డు సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఈ పరిణామాలపై.. అశోక్ గజపతి రాజు కుమార్తె అదితి గజపతి రాజు మండిపడ్డారు. మగ వారసులే ట్రస్ట్‌కు చైర్మన్‌గా వ్యవహరించాలన్న నియమం బోర్డులో ఉందని స్పష్టం చేశారు. సంచిత అసలు వారసురాలే కాదని అతిది గజపతిరాజు వాదిస్తుస్తున్నారు. జగన్ ప్రభుత్వం జీవో తెచ్చి కొత్త ట్రస్ట్ బోర్డు నియమించిందని చట్ట విరుద్ధమని అంటున్నారు. ప్రభుత్వ వ్యూహంతో.. గజపతిరాజుల కుటుంబంలో విబేధాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.