ఇదీ తెలంగాణలో మంత్రుల పరిస్థితి. సమైక్య రాష్ట్రం విడిపోయిన తర్వాత తొలిసారిగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంలో అప్పటి మంత్రులు విశేష అధికారాలను అనుభవించారు. కొత్త రాష్ట్రం వచ్చిందనే మైకంలో, సొంత పాలన చేస్తున్నామనే ఆనందంలో కానిస్టేబుల్ నుంచి కలెక్టర్లపై వరకూ తమ అధికారాన్ని చూపించారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా ఆనాటి మంత్రుల అధికారాలకు, చేస్తున్న పనులకు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. ఈ సువర్ణావకాశం ఆనాటి మంత్రులు యదేచ్ఛగా వాడుకున్నారు. అది ఆనాటి పరిస్థితి. అదేదో ప్రకటనలో చెప్పినట్టు కాలం మారిపోయింది. ప్రభువు మారకపోయినా అధికార వికేంద్రీకరణ మాత్రం జరగలేదు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల్లోనే పాలన సాగుతోంది. నా వల్లనే రెండోసారి విజయం వచ్చిందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మంత్రులను తన కనుసన్నల్లోనే పెట్టుకున్నారు. అధికారం వచ్చిన కొన్నాళ్లకు కేసీఆర్ కుమారరత్నం కల్వకుంట్ల తారక రామారావు తెరపైకి వచ్చారు. వ్యూహాత్మకంగా కొన్నాళ్ళు మంత్రివర్గానికి దూరంగా ఉన్న కేటీఆర్ ఆ తర్వాత తిరిగి క్యాబినెట్ లోకి వచ్చారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి పాలనా వ్యవహారాలను తన వైపు తిప్పుకున్నారు కేటీఆర్. ఇదిగో ఇక్కడి నుంచే తెలంగాణ మంత్రులకు అధికారం దక్కకుండా పోయింది. గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన సీనియర్ మంత్రులు కూడా ఇప్పుడు కేటీఆర్ అదుపాజ్ఞల్లోనే పనిచేస్తున్నారంటున్నారు. సచివాలయమే లేని తెలంగాణ ప్రభుత్వంలో మంత్రులు తమ శాఖలకు సంబంధించిన ఏ ఫైలును కదిలించాలన్నా యువరాజు కేటీఆర్ అనుమతి తప్పనిసరి అయిందంటున్నారు. దీంతో అటు రాజకీయాల్లోనూ, ఇటు పాలనలో కూడా తామెంతో సీనియర్లమని మురిసిపోతున్న మంత్రులు ప్రతి పనికి కేటీఆర్ ముందు చేతులు కట్టుకోవలసిన పరిస్థితి వచ్చిందటున్నారు. ప్రతి సమీక్ష సమావేశంలోనూ కేటీఆర్ ఆదేశాలనే పాటించాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. పేరుకు మంత్రులమే అయినా పెత్తనమంతా యువరాజు చేతుల్లోకి వెళ్ళిపోయిందని అనుచరుల వద్ద సీనియర్ మంత్రులు కూడా వాపోతున్నట్లు సమాచారం.