ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు లిక్కర్ బ్రాండ్లపై విపరీతంగా చర్చ జరుగుతోంది. అక్కడ ప్రసిద్ధి చెందిన కంపెనీలకు చెందిన మద్యం బ్రాండ్లలో ఒక్కటీ అమ్మడం లేదు. ఊరూపేరూ లేని కంపెనీలు అమ్మే హీ మ్యాన్ బీర్. బూమ్ బ్రాందీ, డగ్లస్ విస్కీ.. ఇలా.. నోటికి ఏ పేరు వస్తే ఆ పేరు పెట్టేసి.. స్టిక్కర్లు ప్రింట్ చేసి బాటిళ్లపై అతికించేసి అమ్మేస్తున్నారు. మద్యానికి అలవాటు పడిన వారు.. తప్పనిసరిగా వీటిని తాగుతున్నారు. అనేక మంది… ఈ మద్యం క్వాలిటీపై మండి పడుతూ.. తిట్లు లంకించుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
ప్రముఖ మద్యం బ్రాండ్లు ఏపీలో ఎందుకు అమ్మడం లేదు..?
ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత… తామే సొంతంగా మద్యం దుకాణాలు నిర్వహించాలని నిర్ణయించుకుంది. అంటే.. ఇక దుకాణాల్లో ఏ బ్రాండ్లు అమ్మాలనేది కూడా ప్రభుత్వం ఇష్టమే. మొదట్లో.. పాపులర్ బ్రాండ్స్… అంటే ఎక్కువగా సేల్ అయ్యే బ్రాండ్స్ మాత్రమే అమ్ముతామని ఎక్సైజ్ శాఖ వర్గాలు చెప్పాయి. తర్వాత.. ఆ బ్రాండ్లు కనుమరుగు అవడం ప్రారంభించాయి. ఇప్పుడు.. ఎక్కువ మంది ఏది కొనుక్కుంటే.. అదే పాపులర్ బ్రాండ్ అనే నిర్ణయానికి వచ్చేశారు. అలా అని ఆ బ్రాండ్‌కు పేరు తీసుకు రావడానికి.. ఆ బీర్, బ్రాందీ, విస్కీ బ్రాండ్లను మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. మద్యం తాగాల్సిందే అనుకున్న వారికి అవే అందుబాటులో ఉంటున్నాయి. అసలు ఆ ప్రముఖ మద్యం బ్రాండ్లు ఎందుకు అమ్మడం లేదనేది.. ఇప్పటికీ మిస్టరీనే. వాటికి బకాయిలు చెల్లించలేదని.. అందుకే సరఫరా ఆపేశారని.. మంత్రి నారాయణ స్వామి చెబుతూంటారు. పది రూపాయల సరుకు తీసుకుని వంద రూపాయలకు అమ్మేసుకుని..ఆ పది కూడా.. ఉత్పత్తిదారునకు చెల్లించకుండా ఉండటం…కావాలని చేయడమే కదా. అంటే ఉద్దేశపూర్వకంగా ఆయా కంపెనీలకు బకాయిలు పెట్టారు. సరఫరా నిలిపివేస్తామని ఆయా ప్రముఖ బ్రాండ్ల కంపెనీలు హెచ్చరిస్తే.. సరే అన్నారు కానీ చెల్లింపులు చేయలేదు. అలా వ్యూహాత్మకంగా… ఉద్దేశపూర్వకంగానే ప్రముఖ మద్యం బ్రాండ్ల అమ్మకాలు నిలిపివేశారు.
ఈ పిచ్చి బ్రాండ్ల మద్యం ఎవరు తయారు చేస్తున్నారు..?
మద్యం తయారీ పెద్ద రాకెట్ సైన్స్ కాదు. ఏ చదువూ లేని వాళ్లు కూడా.. గ్రామాల్లో నాటు సారాని కాసేస్తూంటారు. ఈ తరహాలోనే..డిస్టిలరీలు యంత్రాలతో.. విభిన్నరకాల మద్యాన్ని తయారు చేస్తూంటాయి. వీటి తయారీలో ప్రమాణాలు ముఖ్యం. ఇప్పుడు.. ఏపీ మద్యం దుకాణాల్లో దొరుకుతున్న మద్యం తయారు చేస్తున్న డిస్టిలరీలన్నీ ఊరూపేరూ లేనివే. కొన్ని ఇటీవలే ప్రారంభం కాగా.. గతంలో రిజిస్టర్ చేసుకున్న డిస్టిలరీల పేరుతో.. మరికొన్ని ఉత్పత్తి ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. గతంలో ఈ డిస్టిలరీలు.. చీప్ లిక్కర్‌ను ఉత్పత్తి చేసేవి. ఇప్పుడు.. ఆ చీప్ లిక్కర్‌నే.. ప్రీమియం ధరకు.. ఏపీలో అమ్ముకుంటున్నాయి.
పిచ్చి బ్రాండ్స్ అయినా మందు బాబుల నిలువు దోపిడినే..!
అసలు ఏపీ మద్యం షాపుల్లో అమ్ముతున్న మద్యం ధర.. ఎంతో ఎవరికీ తెలియదు. కానీ వాటి ఎమ్మార్పీ మాత్రం… ప్రీమియం బ్రాండ్ల కంటే ఎక్కువే ఉంటుంది. మందుబాబుల వద్ద నుంచి అంత కంటే ఎక్కువగానే పిండి వసూలు చేస్తున్నారు. సాధారణంగా.. ప్రీమియం బ్రాండ్ బీర్.. అంతకు ముందు వంద రూపాయలకు అమ్మారంటే… వాస్తవంగా ప్రభుత్వానికి రూ. 30కే వస్తుంది. అన్ని రకాల టాక్సులు వేసి.. రూ. 100కి అమ్ముతారు. దాదాపుగా 70రూపాయలు ప్రభుత్వానికే వస్తుంది. ఇప్పుడు ఈ చీప్ లిక్కర్ రూ. పదికే డిస్టిలరీలు ఇస్తాయి. కానీ ఏపీ మద్యం దుకాణాల్లో అమ్ముతోంది రూ. 150కి. అంటే మందుబాబు నిలువుదోపిడికి గురవుతున్నట్లే.
టీడీపీ జే ట్యాక్స్ ఆరోపణలు అనుమానించదగ్గవేనా..?
డిస్టిలరీస్ నుంచి నేరుగా కార్టన్‌కు ఇంత చొప్పున.. జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారని.. ప్రీమియం బ్రాండ్ల కంపెనీలు.. అలా కట్టడానికి నిరాకరించాయి కాబట్టే.. వాటికి చెల్లింపులు నిలిపివేసి… సరుకు ఇవ్వకుండా చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చీప్ లిక్కర్ బ్రాండ్లు అమ్ముతున్న కంపెనీలకు.. చెల్లింపులు చేయగలుగుతున్న ఏపీ ఎక్సైజ్ శాఖ.. మంచి బ్రాండ్లు అమ్మేవారికి ఎందుకు చేయలేకపోతోందనేది..ఇక్కడ మౌలికమైన ప్రశ్న. ఏ ఏ బ్రాండ్లు అమ్మాలో.. కొన్ని ఆజ్ఞాత శక్తులు నిర్ణయిస్తున్నాయని… వారి ఇష్టం ప్రకారమే.. ప్రస్తుతం మద్యం బ్రాండ్ల అమ్మకాలు జరుగుతున్నాయనేది.. బ హిరంగంగా జరుగుతున్న చర్చ. దీని కోసం.. నెలకు చేతులు మారుతోంది వందల కోట్లేనని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.