గజపతిరాజుల కుటుంబ పర్యవేక్షణలో ఉన్న మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానం అనేకానేక అనుమానాలకు దారి తీస్తోంది. ఆ ట్రస్ట్‌కు..రూ. లక్ష కోట్లకు పైగా విలువైన పద్నాలుగు వేల ఎకరాల భూములు ఉండటం మాత్రమే కాదు.. 105 ఆలయాలకు అనువంశిక ధర్మకర్తగా ఆ ట్రస్ట్ చైర్మన్ ఉంటారు. ఆ ఆలయాలకు మరో 9వేల ఎకరాల భూములు ఉన్నాయి. అలాంటి ట్రస్ట్ చైర్మన్‌గా అశోక్‌గజపతిరాజును తీసేసి.. సంచైత గజపతిరాజు అనే మహిళను తెరపైకి తెచ్చారు. అనూహ్యంగా.. అశోక్ గజపతిరాజును తొలగిస్తున్నట్లుగా రహస్య జీవో ఇచ్చి తెల్లవారే సరికి.. ఆమెతో మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్‌గా… అలాగే సింహాచలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్‌గా కూడా ప్రమాణస్వీకారం చేయించేశారు. దీంతో.. తెర వెనుక ఏం జరుగుతోందనేదానిపై.. అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి.
ఎవరీ సంచైత గజపతిరాజు..!
పూసపాటి వంశీకులు విజయనగరంలోని కోటలోనే నివసిస్తూంటారు. విజయనగరం జిల్లా ప్రజలందరికీ… పీవీజీ రాజు .. అనందగజపతిరాజు.. అశోక్ గజపతిరాజుల గురించి వారి కుటుంబసభ్యుల గురించి తెలుసు. కానీ ఈ సంచైత గజపతిరాజు గురించి మాత్రం ఎవరికీ తెలియదు. అనందగజపతిరాజు మొదటి భార్య కుమార్తె. విడాకులు తీసుకున్న తర్వాత వీరితో పూసపాటి కుటుంబీలకు ఎలాంటి సంబంధాలు పెట్టుకోలేదు. ఆనందగజపతిరాజు జీవించి ఉన్నంత కాలం.. వీరెవరూ.. విజయనగరం కోట వైపు కూడా రాలేదని చెబుతూంటారు. ఆనందగజపతిరాజు మరణం తర్వాత .. గత ఎన్నికలకు ముందు మాత్రమే.. బీజేపీలో చేరడం ద్వారా వెలుగులోకి వచ్చారు. మొత్తంగా ఆమె కార్యక్షేత్రం ఢిల్లీలోనే. ఢిల్లీ బీజేపీలోనే ఓ పదవిలో ఉన్నారు. గత ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో బీజేపీ తరపున ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు హఠాత్తుగా మాన్సస్ ట్రస్ట్ చైర్మన్‌గా ప్రమాణం చేసేశారు.
మాన్సస్ ట్రస్ట్ భూములపై కన్నేసే గూడుపుఠాణి..!
మాన్సస్ ట్రస్ట్ నిబంధనల ప్రకారం… పూసపాటి వంశీకుల వారసుల్లో పెద్దవారైన మగవారు మాత్రమే… ట్రస్ట్‌కు చైర్మన్‌గా ఉండాలి. అలాగే.. సభ్యులందరి ఆమోదంతోనే చైర్మన్‌ను ఎన్నుకోవాలి. కానీ.. ప్రభుత్వం అలాంటిదేమీ చేయలేదు. అర్థరాత్రి రహస్య జీవోలు విడుదల చేసి.. పని పూర్తి చేసి. ఆ సమయంలో.. ప్రస్తుతం ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజు వైద్య పరీక్షల కోసం ఢిల్లీలో ఉన్నారు. ఇంతగా గూడుపుఠాణి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే.. అందరికీ వస్తున్ సందేహం.. మాన్సస్ ట్రస్ట్‌కు ఉన్న వేల ఎకరాల భూములు. ఏపీలో ప్రభుత్వం మారినప్పటి నుండి… ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి.. మాన్సస్ భూములపై కన్నేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆయన కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని… అంటున్నారు. అశోక్ గజపతిరాజు.. ట్రస్ట్ వ్యవహారాలను చాలా నిశితంగా పరిశీలిస్తారు. భూములు ఆక్రమణకు గురి కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆయనను తప్పిస్తే.. తమ పని సులువు అవుతుందని.. భూములపై కన్నేసిన వారు ఆలోచన చేసినట్లుగా తెలుస్తోంది.
సింహాచలం ఆలయ భూములపై మరో ప్రముఖ వ్యక్తి కన్ను..!
పూసపాటి వంశీయులు అనువంశిక ధర్మకర్తలుగా ఉన్న సింహాచలం ఆలయానికి సంబంధించిన భూములపై .. కొంత మంది కన్ను పడినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చాలా వరకూ ఆక్రమణలకు గురయ్యాయి. వాటి క్రమబద్దీకరణ కోసం.. ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో… మరికొన్ని భూములను ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశాఖను కార్యక్షేత్రంగా చేసుకున్న ఓ ప్రముఖ వ్యక్తి.. ఈ విషయంలో చక్రం తిప్పినట్లుగా భావిస్తున్నారు. సంచైత .. ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్పర్సన్, మాన్సస్ ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా ఉంటే తమ ఇష్టం వచ్చినట్లుగా చేసుకోవచ్చని వారు అంచనా వేసినట్లుగా తెలుస్తోంది.