ఫామ్ హౌస్ అంటే ఇన్నాళ్లూ ఎర్రవల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం అనే గుర్తొచ్చేది. తరచూ కేసీఆర్ అక్కడకు వెళ్తుండాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తూ వచ్చింది. అయితే, మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ ఇప్పుడు వార్తల్లో ప్రముఖంగా నిలుస్తోంది. తండ్రికి ఒక ఫామ్ హౌస్ ఉంది, మంత్రిగా కావాలంటే ఆయనకి క్వార్టర్స్ ఉన్నాయి, అధికారికంగా పెద్ద ప్రగతి భవన్ ఉంది, ముఖ్యమంత్రి కుమారుడుగా ఎక్కడ కావాలంటే అక్కడ, సకల సదుపాయాలతో ఉండేందుకు వీలైన ఇన్ని భవంతులు ఉంటుండగా… ఈ ఫామ్ హౌస్ ఏంటి కొత్తగా, ఎప్పుడూ విన్లేదే, ఉన్నట్టు ఇన్నాళ్లూ తెలీదే అనే చర్చ మొదలైంది. అక్కడేం చేస్తుంటారు అనే ఆసక్తి క్రియేట్ అయింది. రేవంత్ రెడ్డి అరెస్టు తరువాత ఈ అంశానికి మరింత ప్రచారం రావడం ఖాయం.
నిబంధనలకు విరుద్ధంగా కేటీఆర్ ఫామ్ హౌస్ నిర్మించుకున్నారంటూ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను చూసీ చూడనట్టుగా వదిలేసి ఉంటే, ఇప్పుడింత చర్చకు దారి తీసేది కాదేమో. దీన్ని ఇంతదూరం లాగడమంటే, ఓరకంగా విమర్శలు కోరి కొని తెచ్చుకున్నట్టుగానే పరిస్థితి కనిపిస్తోంది. రేవంత్ ఆరోపించిన మర్నాడే కేటీఆర్ స్పందించి, ఏదో కౌంటర్ ఇస్తే సరిపోయేది. ఆ పని చేయకుండా… బాల్క సుమన్ తో ప్రెస్ మీట్ పెట్టించారు. అవును, అది మా కేటీఆర్ ఫామ్ హౌసే, అందరికీ తెలిసిందే, మేం చాలాసార్లు అక్కడికి వెళ్లాం, లీజు తీసుకున్న డాక్యుమెంట్లు కూడా ఉన్నాయంటూ… ఇది పరమ రొటీన్ వ్యవహారం అనే కలర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అక్కడితో ఆగినా బాగుండేది. ఆ తరువాత, డ్రోన్ కెమెరాతో రేవంత్ చిత్రీకరించారనే ఆరోపణలతో కేసు పెట్టారు. ఇంత జరుగుతున్నా కేటీఆర్ ఎక్కడా మాట్లాడలేదు! దీంతో, కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదు, నిజంగానే నిబంధనలకు విరుద్ధంగా ఆయనా వ్యవహరించారా అనే అనుమానాలను ప్రజల్లో పెంచేట్టుగా ఆయనే వ్యవహరించారు.
రేవంత్ ని ఈ కేసులో అరెస్టు చేయడం ద్వారా… కేటీఆర్ ఫామ్ హౌస్ కథా కమామీషు ఏంటనే చర్చ ఇప్పుడు ప్రముఖం అయింది. కేవలం డ్రోన్ తో చిత్రీకరించారన్న కారణంతో ఒక ఎంపీని హుటాహుటిన ఎయిర్ పోర్టుకు వెళ్లి మరీ హడావుడిగా అరెస్టు చేయడం కూడా రాజకీయ కక్ష సాధింపు ధోరణి స్పష్టంగా కనిపిస్తోందన్న అభిప్రాయాలూ వ్యక్తమౌతున్నాయి. పోనీ, గోపనపల్లిలో రేవంత్ సోదరులు భూములు ఆక్రమించారనే అభియోగాలున్నాయి. అక్కడ ఏదన్నా బలమైన ఆధారం దొరికితే రేవంత్ ని ఈ స్థాయిలో అరెస్ట్ చేసినా ప్రజలు కూడా కొంత అర్థం చేసుకునేవారు. చిన్న డ్రోన్ కెమెరాతో విజువల్స్ తీశారన్న కేసుతో అరెస్టు చేయడాన్ని ప్రజలు రాజకీయంగానే చూస్తారనే చెప్పాలి. రేవంత్ చర్యలకు సమర్థింపుగా వ్యాఖ్యానించడం ఇక్కడ ఉద్దేశం కాదు… రాజకీయంగా ఏదో చేద్దామన్న ఉద్దేశంతో, కేటీఆర్ ఫామ్ హౌస్ గురించి అందరికీ తెలిసేలా వారే చేసుకున్నట్టుగా ఉన్నారనే అభిప్రాయం కలుగుతోంది. ఫామ్ హౌస్ విషయంలో కేటీఆర్ ఆత్మరక్షణలో పడ్డారా అనిపిస్తోంది!