కేంద్ర హోం శాఖ మంత్రి, భారతీయ జనతా పార్టీ సుప్రీం అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు వెనక ఎలాంటి కారణం ఉందో తెలంగాణ బిజెపి నాయకులు చెప్పలేకపోతున్నారు. కరోనా వైరస్ కారణంగా పర్యటన రద్దు అయిందని పైకి చెబుతున్నా అంతర్గతంగా పార్టీలో కుమ్ములాటలే కారణమని అంటున్నారు. పౌరసత్వ చట్టంతో పాటు ఇతర అంశాలపై పార్లమెంటులో దుమారం రేగుతున్న సమయంలో హైదరాబాద్ వచ్చి పార్టీ అంతర్గత కుమ్ములాటల్లో ఉన్న ప్రస్తుత సమయంలో హైదరాబాద్ పర్యటించడం అవసరమా అని హోంమంత్రి అమిత్ షా స్థానిక బీజేపీ నాయకుల వద్ద అన్నట్లు చెబుతున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఓ నాయకుడ్ని వెతకాల్సిన ఈ సమయంలో పార్టీలో ఆ పదవి కోసం పైరవీలు, కుమ్ములాటలు ఎక్కువవుతున్నాయని పార్టీ అధిష్గానం భావిస్తోంది. ఈ సమయంలో అమిత్ షా హైదరాబాద్ వస్తే ఆయన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం పలువురు నాయకులు నానా హంగామా చేస్తారని, అమిత్ షా పాల్గొనే బహిరంగ సభకు తాము ఎక్కువ మందిని తీసుకువచ్చామంటే తామే ఎక్కువ మందిని తీసుకువచ్చామంటూ కొత్త వాదాలు ముందుకు వస్తాయని అధిష్టానం భావించినట్లు చెబుతున్నారు.
ఇలాంటి సమయంలో ఈ పర్యటన వాయిదా వేసుకుంటే మంచిదని హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా పార్టీ సుప్రీంతో అన్నట్లు చెబుతున్నారు. ఈ నెల 15వ తేదిన నగరంలో బహిరంగ సభ నిర్వహించాలని భావించారు. ఈ సభకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారు వారి వారి జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ చేయాలని అనుకున్నారు. ఆ విధంగా తమ బలాన్ని, బలగాన్ని ప్రదర్శించాలని భావించారు. అయితే, దీనిని తెలుసుకున్న ఇప్పుడు బహిరంగ సభకు వచ్చి మళ్లీ వివాదాలను పెంచడం ఎందుకని మిన్నకున్నట్లు చెబుతున్నారు. బహిరంగ సభ రద్దుకు కారణాలను వెతకాల్సిన పని లేకుండా కరోనా వైరస్ కాపాడిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలాఖరులోగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుని ఎంపిక చేసి అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధిష్టానం భావిస్తున్నట్లు
సమాచారం.