కరోనా వైరస్ ఏపీలో అడుగు పెట్టకుండా.. పెట్టినా..పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి జగన్మోహన్ రెడ్డి రూ. రెండు వందల కోట్లను రెడీ చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరోనాను ఎదుర్కొవడంపై ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. తీసుకుంటున్న చర్యలు, జాగ్రత్తలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఏపీలో ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నామని .. వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారులు ప్రకటించారు. ఎవరికీ కరోనా రాకపోయినా అప్రమత్తంగా ఉన్నామని అధికారులు ప్రకటించారు.
అధికారులు తీసుకుంటున్న చర్యలతో ప్రజలను ఆందోళనకు గురిచేయాల్సిన అవసరం లేదని.. వారికి జాగ్రత్తలతోపాటు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తే చాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. గ్రామ సచివాలయాలను ఈ కరోనా వైరస్ను ఎదుర్కోవడంలో భాగస్వాములు చేయాలని జగన్ ఆదేశించారు. అనంతపురం, విజయవాడలో ప్రత్యేక వార్డుల నిర్వహణకు 60 కోట్ల రూపాయలు, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు 200 కోట్ల రూపాయల నిధులను తక్షణమే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
కరోనా వైరస్ సోకినా సోకకపోయినా.. పెద్ద ఎత్తున అవే లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్న వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారందర్నీ ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచుతున్నారు. ఇతర దేశాల నుంచి వస్తున్న వారిలోనే కరోనా వైరస్ ఉంటోంది. వారి ద్వారా వ్యాప్తి చెందెందుకు అవకాశం ఉంటుంది కాబట్టి.. ప్రత్యేకమైన స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ.. కరోనా వైరస్ ఏపీలోకి ఎంటర్ కాకూడదని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.