పూసపాటి అశోక్‌గజపతిరాజును తప్పించి.. సంచైత గజపతిరాజుకు.. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవుల్ని అప్పగించడం .. ఏపీ బీజేపీ నేతలకు నచ్చడం లేదు. సంచైత స్వయంగా బీజేపీ నేత అయినప్పటికీ.. వారు.. ట్రస్టు భూములు.. వాటి కార్యకలాపాలైనే ఆందోళన చెందుతున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి ఫ్రంట్ రన్నర్‌గా ఉన్న ఎమ్మెల్సీ మాధవ్.. ఈ విషయంలో ఘాటుగానే స్పందించారు. సింహాచలం దేవస్థానం చైర్మన్‌ను మారుస్తూ…రాత్రికి రాత్రే జీవో ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. చైర్మన్‌గా ఉన్న అశోక్ గజపతిరాజుకు సమాచారం ఇవ్వకుండా… చైర్ పర్సన్‌గా సంచయితను నియమించడాన్ని ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. అంతే కాదు.. బీజేపీ అధికార ప్రతినిధిగా సంచయితను తొలగించాలని కేంద్రానికి లేఖ రాశామని కూడా.. మీడియా ముందు తేల్చేశారు.
బీజేపీ అధిష్ఠానంతో చెప్పకుండా సంచయిత ఈ నిర్ణయం తీసుకున్నారని … దేవాలయ భూములపై అధికార పార్టీ కన్ను వేసిందని ఆరోపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా.. వైసీపీ రాజకీయ రాక్షస క్రీడ ఆడుతోందని మండిపడ్డారు. పీవీజీ రాజు కాలం నుంచి జరుగుతున్న ప్రక్రియకు తూట్లు పొడిచారని విమర్శించారు. సంచయిత ఎన్నిసార్లు సింహాచలం దేవస్థానానికి వచ్చి ఉంటారని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. సంచయిత ఆత్మ విమర్శ చేసుకోవాలని .. ప్రభుత్వ జీవోలు పక్కన పెట్టి… ఆ పదవికి అర్హత ఉందో లేదో ఆలోచించుకోవాలని విష్ణుకుమార్‌రాజు సలహా ఇచ్చారు. బీజేపీకి చెప్పకుండానే వైసీపీ.. సంచయిత ఈ వ్యవహారం నడిపారని.. బీజేపీ నేతలు అంటున్నారు.
మాన్సాస్ ట్రస్ట్‌కు సంచయితను చైర్మన్‌గా నియమించిన ప్రక్రియ అంతా ఓ గూడుపుఠాణిలా సాగడంతో… ఆ ట్రస్టు భూములు.. విద్యా సంస్థలు ఉన్న ప్రతీ చోటా… ఈ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. బీజేపీ కూడా.. దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు తేలడంతో.. తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఆసక్తి వ్యక్తమవుతోంది. వైద్య పరీక్షల కోసం ఢిల్లీలో ఉన్న అశోక్ గజపతిరాజు తిరిగి వచ్చిన తర్వాతనే న్యాయపోరాటంపై నిర్ణయం తీసుకుంటారని.. చెబుతున్నారు.