స్థానిక ఎన్నికల కోసం పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తామని ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమషనర్‌కు చెప్పింది. ఎన్నికల షెడ్యూల్‌ను బట్టి.. పరీక్షల తేదీలను ఖరారు చేస్తామని మంత్రి కూడా చెబుతున్నారు. అంటే.. మార్చి నెలలో టెన్త్ పరీక్షలు లేనట్లే. ఏప్రిల్ మొదటి వారంలోనే పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏపీలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. సాధారణం అవి పూర్తయిన తర్వాత టెన్త్ పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ వాటి మధ్యలో ఈ సారి గ్యాప్ రానుంది. ఇంటర్ పరీక్షలు వాయిదా వేయడం అసాధ్యం. అనేక జాతీయ ప్రవేశ పరీక్షలతో.. ఇంటర్ పరీక్షలు ముడిపడి ఉంటాయి. ఆయా ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌కు తగ్గట్లుగా ఇక్కడ కూడా ఫలితాలు విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా.. ఒక్క టెన్త్ పరీక్షలు మాత్రమే వాయిదా వేస్తున్నట్లుగా తెలుస్తోంది.
దాదాపుగా ఏడు లక్షల మందికిపైగా టెన్త్ విద్యార్థులు … తమ జీవితంలో అత్యంత కీలకమైన దశను దాటేందుకు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. వీరందరికి మరో నెల పాటు టెన్షన్ తప్పదు. ప్రభుత్వం స్థానిక ఎన్నికల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించకపోవడం… ముందస్తు పరిణామాలను అంచనా వేయకపోవడంతోనే సమస్య వచ్చింది. మార్చిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, పరీక్షలు ఉంటాయని… ఆ సమయంలో.. ఎలాంటి ఎన్నికల ప్రక్రియ కూడా సాధ్యం కాదని.. అధికారయంత్రాంగానికి మొత్తం తెలుసు. అయినప్పటికీ.. మార్చిలో ఎన్నికలు రాకుండా నివారించడంలో విఫలమయ్యారు. అసెంబ్లీ జరగకపోయినా… టెన్త్ పరీక్షలు వాయిదా పడినా.. ఎన్నికలు మాత్రం మార్చిలోనే జరగాలని అధికార పార్టీ పట్టుదలతో ఉంది.
స్థానిక ఎన్నికలు ఇప్పటికే ఏడాది ఆలస్యమయ్యాయి. మార్చి 31లోపు నిర్వహించకపోతే.. ఆర్థిక సంఘం నిధులు ఆగిపోతాయని చెబుతున్నారు. అయితే.. ఆ తర్వాత అయినా.. ఎన్నికలయిన తర్వాత కేంద్రానికి రిక్వెస్ట్ పెట్టుకుంటే.. విడుదల చేస్తుందని.. గతంలో.. పలు రాష్ట్రాలకు అలా ఇచ్చిందనే విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. ఏదైమైనా.. ఎన్నికల కోసం పరీక్షల్ని వాయిదా వేయడం… మాత్రం.. ఓ రికార్డ్ అయ్యే అవకాశం ఉంది.