ఆంధ్రప్రదేశ్ లో స్థానిక పోరు ప్రారంభమైంది. తక్కువ సమయంలోనే స్థానిక ఎన్నికలు రానున్నాయి. దీంతో రాజకీయ పార్టీలలో ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. తొమ్మిది నెలల తర్వాత మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ఎత్తుగడలకు తెర లేచింది. పొత్తులు, ఎత్తులు, రాజకీయ వ్యూహాలు ఊపందుకుంటున్నాయి. స్థానిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అధ్యక్షుడు పిలుపు కార్యకర్తలకు చేరింది కానీ వారి మనసులు మాత్రం కమలంతో కలయికను వ్యతిరేకిస్తున్నాయని అంటున్నారు. సాధారణ ఎన్నికలకు, స్థానిక ఎన్నికలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందని, స్థానికంగా ఉన్న వారు ఎన్నాళ్ల నుంచో సత్సంబంధాలు కలిగి ఉంటారని, అలాంటి వారిని బీజీపీకి ఓటు వేయమని అడగడం ప్రజల ముందు తల దించుకోవడం వంటిదేనని జనసేన స్థానిక నాయకులు అంటున్నారు. ఢిల్లీలో చేసుకున్న ఒప్పందానికి, గ్రామ గల్లీలో తిరిగే మాకు చాలా తేడా ఉంటుందని, ఇది గ్రహించకుండా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కమలంతో కలిసి నడవాలని చెప్పడం సమంజసం కాదని వారంటున్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా జనసేనతో పొత్తుపై పెదవి విరుస్తున్నారు. గత ఎన్నికలలో కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలిచిన జనసేనతో కలిసి ఎలా పోటీ చేస్తామని ప్రశ్నిస్తున్నారు. ఆ ఎన్నికలలో రెండు స్థానాల నుంచి పోటీ చేసిన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓడిపోయారని, అలాంటి పార్టీతో ఎలా కలుస్తామని కమలనాథులు వాపోతున్నారు. గతంలో కూడా ఇలాంటి పొత్తుల కారణంగానే ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఎదగలేక పోయిందనే విషయం గుర్తుపెట్టుకోవాలని, మళ్లీ అలాంటి తప్పు చేయవద్దని బిజెపి నాయకులు అధిష్టానాన్ని కోరుతున్నారు. పైగా స్థానిక ఎన్నికలలో పార్టీల కంటే స్థానిక అభ్యర్థులకు ఎక్కువ విలువ ఉంటుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని కమలనాథులు సూచిస్తున్నారు.