మంచు మోహన్‌బాబు కాలేజీకి ఫీజు ప్రతిఫలం లభించబోతోంది. ఏపీలో విద్యానికేతన్ కన్నా.. మించిన ఇంజినీరింగ్ కాలేజీలు లేవని నిర్ధారించేసి.. ఆ కాలేజీలో ఫీజును ఏటా రూ.99వేలుగా నిర్ధారించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ అవకాశం రాష్ట్రంలో ఆ ఒక్క కాలేజీకే ఉంది. ఇక ఇంజినీరింగ్ విద్య ఆకాశంలో ఉన్నప్పుడు ప్రారంభమై… కొత్త కాలేజీలు వచ్చిన తర్వాత కూడా ప్రమాణాలు నిలుపుకున్న అనేక సంస్థలు విద్యానికేతన్ తర్వాతనే ఫీజులు వసూలు చేయనున్నాయి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నత విద్య, నియంత్రణ కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్.. అన్ని కాలేజీల్లో తనిఖీలు చేసి.. ఫీజులు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత అధికారంగా ప్రకటిస్తారు.
అత్యధిక ఇంజినీరింగ్ కాలేజీల్లో ఏటా రూ. 33వేలు మాత్రమే ఫీజు ఉండనుంది. మిగతా కాలేజీలు వాటిలోని సౌకర్యాలను బట్టి… కొద్ది కొద్దిగా పెంచుకుటూ పోతారు. ఫీజురీఎంబర్స్మెంట్ పథకం ప్రకారం… విద్యార్థులందరి ఫీజులు ప్రభుత్వమే చెల్లించనుంది. అంటే.. మోహన్ బాబు కు చెందిన శ్రీ విద్యానికేతన్ అయినా.. మరో కాలేజీ అయినా… ప్రభుత్వం ఎంత ఫీజు నిర్ధారిస్తే.. అంత ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇప్పటికే విద్యాదీవెను కార్డులు కూడా పంపిణీ చేశారు. ఈ కార్డులు అందుకున్న వారందరికీ.. ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తుంది. కొన్ని ప్రఖ్యాతి చెందిన కాలేజీల్లో… సొంతంగా ఫీజులు కట్టి చేరేవారు ఉంటారు కానీ.. .విద్యాదీవెన పథకం అర్హతనే నిర్ణయించి చేర్చుకునే కాలేజీలు చాలా ఉన్నాయి.
ఎన్నికలకు ముందు మోహన్‌బాబు.. తన కాలేజీకి ప్రభుత్వం ఫీజు బకాయిలు ఉందని రోడ్డెక్కారు. విద్యార్థులతో కలిసి ఆందోళన చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాది ఫీజులను ఒక్క సారి కూడా విడుదల చేయలేదు. కాలేజీల యాజమాన్యాలు ఆందోళనలు చేసినా స్పందించలేదు. ఆయన పేరు.. వివిధ పదవులకు పరిశీలనలోకి వచ్చిందని మీడియాలో ప్రచారం జరిగింది. చివరికి రాజ్యసభ సీటు కూడా ఇస్తారని అనుకున్నారు. అవేమీ లభించడం లేదు. కానీ ఆయన కాలేజీకి మాత్రం ఫీజును అన్ని కాలేజీల కంటే ఎక్కువగా నిర్ధారిస్తున్నారు. మోహన్‌బాబుకు అదొక్కటే ఊరట గా భావించవచ్చు.