దేశంలో ప్రముఖ ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటి అయిన ” యస్ బ్యాంక్ ” .పని దాదాపుగా అయిపోయింది. డిపాజిట్ దారులకు తాను భరోసా అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెబుతున్నారు కానీ.. అందులో డబ్బులు డిపాజిట్ చేసిన ఒక్కరంటే.. ఒక్కరు కూడా స్థిమితంగా ఉండలేకపోతున్నారు. దీనికి కారణం.. అసలు బ్యాంకులకు ఇలాంటి పరిస్థితి రావడానికి కేంద్ర ఆర్థిక విధానాలే కారణమన్న అభిప్రాయాలు బలంగా ఉండటమే దీనికి కారణం. బ్యాంక్ అంటే.. ఏదైనా సరే భద్రమే.. అందులో డబ్బులేస్తే..ఢోకా ఉండదనేది సగటు మనిషికి ఉన్న నమ్మకం. కానీ కొన్నాళ్లుగా ఆ నమ్మకం బద్దలవుతోంది. కొద్ది రోజుల క్రితం.. కమర్షియల్ బ్యాంక్ కాకపోయినా… పీఏంజే బ్యాంక్ దివాలా తీయడం.. డిపాజిటర్లను నట్టేట ముంచడం కళ్ల ముందే ఉంది.
అప్పుడు కేంద్రం… రెగ్యూలేట్ చేయాల్సిన ఆర్బీఐ డిపాజిటర్లను.. ఆదుకోవడానికి ముందుకురాలేదు. ఇప్పుడు చెప్పినట్లే మాటలు చెప్పారు. ఇన్సూరెన్స్ ఉందని.. మరొకటి అని చెప్పుకొచ్చారు. అప్పుడు పీఏంజే బ్యాంక్ అయిన.. ఇప్పుడు కమర్షియల్ బ్యాంక్ అయిన యస్ బ్యాంక్ అయినా… సరైన రెగ్యూలేషన్ వ్యవస్థ లేకనే భ్రష్టుపట్టిపోయింది. తీసుకున్న డిపాజిట్లను బల్క్‌గా కొన్ని సంస్థలకు అప్పుగా ఇచ్చేయడం.. వారు డిఫాల్ట్ కావడంతోనే సమస్య వచ్చింది. అలా అప్పులు ఇవ్వడానికి .. ఆ బ్యాంకును నిర్వహిస్తున్న వారు అక్రమాలకు పాల్పడ్డారు. ఇది.. చాలా కాలంగా సాగుతోంది. ఆ విషయం ఆర్బీఐ దృష్టికి వెళ్లినా… చర్యలు తీసుకోలేదు. ఆ బ్యాంకులు.. అడ్డగోలు మార్గంలో వెళ్తున్నాయని స్పష్టమైన సూచనలు ఉన్నా.. పట్టించుకోలేదు. యస్ బ్యాంక్ సంక్షోభం దిశగా వెళ్తోందని.. మూడేళ్ల కిందటే తెలుసని.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గొప్పగా ప్రకటించారు. కానీ మూడేళ్లలో.. ఆ బ్యాంక్ బోర్డును ఎందుకు అప్రమత్తం చేయలేదు..? ఎందుకు పరిస్థితులు చక్కదిద్దే ప్రయత్నం చేయలేదో ఎవరికీ తెలియదు.
ఇందులోనూ మళ్లీ రాజకీయాలు.. యూపీఏ వల్లే ఇప్పుడు బ్యాంకులు మూతపడుతున్నాయన్న ఆరోపణలు చేస్తున్నారు. ఆ బ్యాంకులు ఎవరి వల్ల మూత పడుతున్నాయన్నది ఇక్కడ సమస్య కాదు.. ఇలాంటి పరిణామాల దేశ ఆర్థిక వ్యవస్థ పై నమ్మకం సడలిపోతోందన్న విషయాన్ని ఆర్థిక మంత్రి గుర్తించలేకపోతున్నారు. బడా బడా వ్యాపార సంస్థలు దివాలా దిశగా ఉన్నాయి. వాటికి అప్పులు ఇచ్చిన బ్యాంకులు అదే బాటలో ఉన్నాయి. యస్ బ్యాంక్ నుంచి డిపాజిటర్లు డబ్బులు డ్రా చేయడానికి్ మారటోరియం విధించాల్సిన పరిస్థితి వచ్చిందంటే… దాని వల్ల నష్టపోయేది డిపాజిటర్లు మాత్రమే కాదు.. దేశం కూడా. వీటన్నింటిని చక్కదిద్దకపోతే… పరిస్థితులు దారుణంగా మారిపోయే ప్రమాదం ఉంది.