అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయంటే ఎమ్మెల్యేలంతా సభకు వెళ్తారు. లాబీల్లో, మీడియా పాయింట్ దగ్గర హడావుడిగా ఉంటుంది. అది రొటీన్! కానీ, ఈసారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మరో భిన్నమైన దృశ్యం కూడా కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, కొందరు సీనియర్ నేతలు కూడా అసెంబ్లీకి వస్తున్నారు. ఉదయం పది గంటలకే నాయకుల తాకిడి అసెంబ్లీకి పెరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఒక్కసారి కలవాలన్నది వీరి ప్రయత్నం! సీఎం సార్ చాలా బిజీగా ఉన్నారు అని అధికారులు చెబుతున్నా, ఫర్వాలేదు సాయంత్రం వరకైనా వెయిట్ చేస్తామంటున్నారు. సీఎం షెడ్యూల్ చాలా బిజీగా ఉందని చెప్పినా, కలవడం కుదరదని అంటున్నా కూడా లాబీల్లో కూర్చుంటూ పడిగాపులు కాస్తున్నారు. ఇంతకీ ముఖ్యమంత్రి కోసం ఎందుకింత ఎదురుచూపులంటే… పదవుల కోసమే!
తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ రెండు సీట్ల కోసం చాలామంది నేతలు పోటీ పడుతున్నారు. వీళ్లంతా సీఎంని కలిసి, తమకి రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరే ప్రయత్నమే ఈ హడావుడి. నిన్న, సభ నుంచి కేసీఆర్ బయటకి వెళ్తుంటే… ఆయన దృష్టిలో పడేందుకు కొంతమంది నేతలు పరుగులు తీశారు. ఆయన వేగంగా వెళ్లిపోయాక.. మంత్రి కేటీఆర్ రాగానే అలాగే వెంటపడ్డారు! మాజీ ఎంపీ గుండు సుధారాణి ఉదయం నుంచీ సీఎం కోసం వెయిట్ చేశారు. ఆ తరువాత, కేటీఆర్ అసెంబ్లీ ఆవరణలో కనిపించగానే వెళ్లి కలిశారు. ఇరవయ్యేళ్లు రాజకీయాల్లో ఉన్నా కూడా ఇలా వెయిట్ చెయ్యాల్సి వస్తోందని కాస్త నిర్వేదంగానే ఆ తరువాత మీడియాతో ఆమె చెప్పారు. రాజ్యసభ సీటు తనకు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ని గతంలో కోరాననీ, కేటీఆర్ కి కూడా అదే మాట చెప్పానన్నారు. ఆమెతోపాటు మాజీ ఎంపీలు సీతారామ్ నాయక్, నగేష్ లు కూడా అసెంబ్లీ లాబీల్లో ఉన్నారు. అరికెల నర్సింహారెడ్డి, ముజీబ్, పొంగులేటి… ఇలా చాలామంది నేతలు అసెంబ్లీ ఆవరణలో కనిపిస్తున్నారు. తనకు అవకాశం పక్కా అనే ధీమాతోనే ఉన్నారు పొంగులేటి. ఖమ్మం నుంచి హెటిరో ఫార్మా అధినేత పార్థసారథి కూడా రాజ్యసభ సీటు కోసం ప్రయత్నిస్తున్నా, వ్యాపారవేత్తలకు కేసీఆర్ అవకాశం ఇవ్వరని ఆయన ధీమాగా చెబుతున్నారు.
ఖాళీ అవుతున్నది రెండు స్థానాలు. కానీ, పోటీ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా అసెంబ్లీ దగ్గరకి వచ్చి మరీ ముఖ్యమంత్రి, లేదా కేటీఆర్ ని కలిసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుండం చూస్తుంటే… ప్రజా సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్లడానికి ఏనాడైనా ఈ తరహా ప్రయత్నం చేశారా, ఇన్ని గంటలు పడిగాపులు పడ్డారా అనిపిస్తుంది.