వైసీపీ తరపున రాజ్యసభ సభ్యత్వాన్ని రిలయన్స్ ప్రముఖుడు పరిమళ్ నత్వానీకి జగన్మోహన్ రెడ్డి ఖరారు చేసినట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే… నామినేషన్ల దాఖలుకు చివరి రోజు లేదా.. అంతకు ముందు రోజు మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్రంతో సంబంధం లేని ఓ పారిశ్రామిక వేత్తకు.. బీజేపీని మంచి చేసుకునేందుకు అదీ కూడా.. తన తండ్రిని చంపారని ఆరోపించిన రిలయన్స్ అధినేతకు అత్యంత సన్నిహితుయిన వ్యక్తికి.. రాజ్యసభ సీటు కేటాయిస్తే.. రాష్ట్రంలో తీవ్ర విమర్శలు వచ్చే అవకాశం ఉంది. దానిపై చర్చ జరగకుండా ఉండేందుకు ఈ నెల పన్నెండు లేదా పదమూడో తేదీన నత్వానీని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది.
అయితే.. నత్వానీని.. వైసీపీ తరపున రాజ్యసభకు పంపుతారా లేక.. స్వతంత్ర అభ్యర్థిగా ఎంపిక చేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. నత్వానీ ఇప్పటి వరకూ జార్ఖండ్ నుంచి రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. రెండు సార్లు ఆయన స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేశారు. ఆయనకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఓట్లు వేశారు. ఈ సారి ఏపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఆయన పార్టీ తరపున కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసే అవకాశాలున్నాయంటున్నారు. మొత్తం నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి. సంఖ్యాబలం ప్రకారం నాలుగూ వైసీపీకే వస్తాయి. అందుకే టీడీపీ పోటీ ఆలోచన కూడా చేయడం లేదు. నలుగురు నామినేషన్లు వేస్తే.. నలుగురూ ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. ముగ్గుర్ని వైసీపీ తరపున.. ఒకరు ఇండిపెండెంట్గా నామినేషన్లు వేసినా ఏకగ్రీవమవుతారు.
ఈ పద్దతికే పరిమళ్ నత్వానీ మొగ్గుచూపుతున్నారు. వైసీపీ ఇప్పటికే రాజ్యసభకు పంపాలని నిర్ణయించుకుంది కాబట్టి.. తమ పార్టీనా.. వేరే పార్టీనా.. అన్నది చూసుకునే అవకాశం లేదంటున్నారు. నత్వానీ వైసీపీ తరపున బరిలోకి దిగితే.. వైసీపీ విప్ ను పాటించాల్సి ఉంటుంది. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగితే.. వైసీపీతో సంబంధం లేకుండా బీజేపీకి మద్దతివ్వొచ్చు. ఇది కూడా ఓ కారణం అంటున్నారు. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారా.. వైసీపీ తరపున అన్నది… నాలుగైదు రోజుల్లో తేలిపోతుంది… ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లడం అయితే మాత్రం ఖాయం..!