తమ్మారెడ్డి భరద్వాజా యాక్టీవ్ ప్రొడ్యూసర్ అయితే కాదు. కానీ.. చిత్రసీమలో ఒకానొక పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. ఏదైనా సమస్య వస్తే… ముక్కు సూటిగా మాట్లాడడం ఆయన నైజం. ఆ లక్షణమే స్నేహితుల్ని సైతం దూరం చేసింది. ఆయనకంటూ ఓ ప్రత్యేకతని తీసుకొచ్చింది. సుదీర్ఘ విరామం తరవాత ఆయన్నుంచి ఓ సినిమా వచ్చింది. అదే.. పలాస. ఈ చిత్రానికి మంచి రివ్యూలొచ్చాయి. కానీ థియేటర్లో జనం మాత్రం లేరు. దాంతో తమ్మారెడ్డి బాగా హర్టయ్యారు. దళితుల సమస్యలపై పోరాడిన సినిమా ఇది. వాళ్లకు రాజ్యాధికారం ఇవ్వాలన్న బలమైన కోరికను ఈ సినిమాలో బయట పెట్టాడు దర్శకుడు. ఈ సినిమాని దళితుల నుంచే స్పందన రావడం లేదని, మీ సినిమాలు మీరు చూడకపోతే… అది మీ ఖర్మ అంటూ వాపోయారు తమ్మారెడ్డి.
దళిత పాత్రలతో సినిమాలు తీయడం చాలా సాహసం అని, వాళ్లనే హీరోలుగా పెట్టి పలాస సినిమా తీశామని, మంచి రివ్యూలొచ్చాయని, కానీ దళితులే ఈ సినిమాని పట్టించుకోవడం లేదని ఫీలౌతున్నారు తమ్మారెడ్డి.
” ఒక మంచి సినిమా కావాలి అంటారు..మంచి రివ్యూ లు కావాలి అంటారు..అవన్నీ ఉన్న సినిమా పలాస 1978. దళితులు పాత్ర లు సినిమాల్లో ఉండవు.. దళిత కథ లు సినిమా గా మారవు అంటారు.. కానీ పలాస లో వారి పాత్రలను హీరో లను చేసాము..వారి సమస్యలను చర్చించాము.. కానీ వారి నుండే స్పందన కరువైంది. మీసినిమాలు కూడా మీరు చూడక పోతే మీ ఖర్మ. మీరు చూసి ఆశీర్వదిస్తే..మరిన్ని సినిమాలు వస్తాయి..ఇది నా ఆవేదన” – అంటూ విచారం వ్యక్తం చేశారు తమ్మారెడ్డి. ఈ శుక్రవారం నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అయితే నాలుగింటిలో పలాసకి మాత్రమే మంచి రేటింగులు వచ్చాయి. అయితే ఏ సినిమాకీ సరైన వసూళ్లు లేవు. కరోనా వైరస్ ప్రేక్షకుల్ని థియేటర్లకు రానివ్వకుండా చేస్తోంది. దానికి తోడు పరీక్షల సీజన్ ఒకటి.