అసెంబ్లీలో ఎర్రబెల్లి దయాకరరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ మధ్య వాగ్వాదం జరిగింది. అయితే, అది అంశాల పరిధి దాటి వ్యక్తిగత స్థాయికి వెళ్లిపోయింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ… రాష్ట్రంలో స్కూళ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందనీ, గ్రామాల్లో పాఠశాలు బాగులేవనీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు లేరని ఆరోపించారు. దీంతో ఎర్రబెల్లి కౌంటర్ ఇస్తూ… జిల్లాలకు వెళ్లి చూద్దామా అంటూ సవాల్ చేశారు. ఆయన (రాజగోపాల్) ప్రజల్లో తిరుగుతున్నాడో, రోడ్ల మీద తిరుగుతున్నాడో అర్థమైతలేదన్నారు. నీకో మిత్రునిగా సలహా ఇస్తున్నా, నువ్వు నా వెంట రా, ఏ జిల్లాకంటే ఆ జిల్లాకి పోదామన్నారు. జనాలు ఉరికించి ఉరికించి కొడతారు నిన్ను… ఏమ్మాట్లాడుతున్నావ్ నువ్వు అంటూ రాజగోపాల్ మీద ఫైర్ అయ్యారు మంత్రి.
దీనిపై రాజగోపాల్ మళ్లీ స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే తమకు అభిమానమనీ, అందుకే ఎప్పుడూ ముఖ్యమంత్రిపై నేరుగా విమర్శలు చెయ్యనన్నారు. పార్టీ వేరైనా ఒక కుటుంబ సభ్యునిగా, మాకు పెద్దన్నతో సమానం అన్నారు. రాజకీయాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా ఆయన్ని అభిమానిస్తామన్నారు. ఈ ఎర్రబెల్లి దయాకరరావు… ఇటువంటోళ్లు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు అధ్యక్షా అంటూ రాజగోపాల్ విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో వీళ్లెక్కడి నుంచి వచ్చారన్నారు? అది ఆయన తప్పు కాదనీ, తెలంగాణ ద్రోహులను కేబినెట్లో చేర్చుకున్న ముఖ్యమంత్రిది తప్పు అని విమర్శించారు రాజగోపాల్ రెడ్డి.
ఇందతా అయిపోయాక… ఎర్రబెల్లిని సీఎం పిలిపించుకున్నారని సమాచారం. ఎందుకు అనవసరంగా జోక్యం చేసుకున్నావని క్లాస్ తీసుకున్నట్టు వినిపిస్తోంది. మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా అని సీఎం అన్నట్టుగా తెలుస్తోంది. దీంతో, ముఖ్యమంత్రికి ఎర్రబెల్లి సారీ కూడా చెప్పారని తెలుస్తోంది. సమస్యలను ఎత్తి చూపుతూ ప్రతిపక్ష నేతలు విమర్శలూ ఆరోపణలు చేయడం సహజం. దానికి ప్రభుత్వం నుంచి సమాధానం కూడా అదే స్థాయిలో ఉండాలి. దాన్ని మంత్రులే దాటేసి ఉరికించి కొడతాం, జనాల్లో తిరగనియ్యం అని వ్యాఖ్యానిస్తే అసలు చర్చ ఎటో వెళ్లిపోయి, చివరికి పోయేది అధికార పార్టీ పరువే కదా.