జగనన్న “అమ్మఒడి” గురించి.. చెన్నైలో ఉన్న మీ మిత్రుడికి ఉత్తరం రాయండి..! … ఊరకే కాదు.. రాస్తే ఐదు మార్కులు వేస్తారు. మీ స్కూల్లో జరిగిన “అమ్మఒడి” కార్యక్రమం గురించి పత్రికకు లేఖ రాయండి..! ఇది కూడా ఊరకనే కాదు.. ఐదు మార్కులకే. టెన్త్ విద్యార్థులకు పది మార్కులు కాదు.. ఒక్క మార్క్ అయినా… మహాప్రసాదమే. అమ్మఒడి గురించి పూర్తిగా తెలుసుకుని.. రాయడానికి సిద్ధపడితే.. ఖచ్చితంగా మార్కులు వస్తాయి. ఈ విషయాన్ని అధికారులు… ప్రీ ఫైనల్ పరీక్షలతోనే.. లీక్ చేసేశారు. స్థానిక ఎన్నికల కోసం టెన్త్ పరీక్షలను నెలాఖరు రోజు నుంచి ప్రారంభించాలని రీషెడ్యూల్ చేశారు. కానీ ప్రీ ఫైనల్ పరీక్షలు మాత్రం జరుగుతున్నాయి. ఇందులో ప్రశ్నాపత్రాల్లో వస్తున్న ప్రశ్నల తీరు… విద్యార్థులను షాక్కు గురి చేస్తోంది. హిందీ, ఇంగ్లీష్ ప్రశ్నాపత్రాల్లో అమ్మ ఒడి పథకంపై ప్రశ్నలు వేశారు.
అమ్మ ఒడి పథకం అమలు తీరును వివరిస్తూ చెన్నైలో ఉండే మీ ఫ్రెండ్ కి లేఖ రాయాలని ఓ ప్రశ్న అలాగే.. అమ్మ ఒడి పథకం కింద ఎంతమంది లబ్ధిదారులున్నారు..? అర్హత నిబంధనలు, కొత్త పథకం అమలు తీరు ఎలా జరుగుతుందనే అంశాలపై లేఖ రాయాలంటూ మరో ప్రశ్న వేశారు. సెక్షన్ ‘C’లోనే అమ్మ ఒడి పథకంపైనే రెండు ప్రశ్నలు ఉన్నాయి. అంటే.. ఖచ్చితంగా అమ్మఒడిపైనే ఒకటి రాయాల్సి ఉంటుంది. అలా రాస్తేనే ఐదు మార్కులు వస్తాయి. ఎస్ఎస్సీ బోర్డు అధికారులు రాజును మించిన రాజభక్తి చూపుతున్నారన్న అభిప్రాయం… వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ప్రవేశ పెట్టే పథకాలు.. రాజకీయ లక్ష్యాలతో ప్రశ్నా పత్రాలు నింపడం అనేది ఇప్పటి వరకూ జరగలేదు.
కానీ.. అమ్మఒడి పేరుతో.. స్కూలు విద్యార్థుల తల్లులకు డబ్బులు పంచుతున్నామన్న కారణంగా.. దాని గురించి తెలుసుకోవడమే… ముఖ్యమన్నట్లుగా అధికారులు ప్రశ్నాపత్రాల్లోనూ సంధిస్తున్నారు. అధికారుల అత్యుత్సాహం ప్రీ ఫైనల్లోనూ ఇలా ఉందంటే… ఫైనల్ పరీక్షల్లోనూ ఇవి ఖచ్చితంగా ఉటాయంటున్నారు. అమ్మఒడి గురించి తెలుసుకుని.. రాయగలిగితే.. ఐదు మార్కులు ఖాయమన్న అభిప్రాయాన్ని టెస్త్ విద్యార్థులకు కల్పిస్తున్నారు.