తన కుమార్తె అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న అక్కసుతో ప్రణయ్ ని హత్య చేయించిన కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఖైరతాబాద్ లోని ఆర్యవైశ్య భవన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయన ఒక్కరే గదిలో ఉన్నారని పోలీసులు అంటున్నారు. వ్యాపార సంబంధ విషయమై ఆయన హైదరాబాద్ కి వెళ్తున్నానని నిన్న మిర్యాలగూడ నుంచి బయల్దేరారు. నిన్న రాత్రే ఆత్మహత్యకి పాల్పడ్డట్టు భావిస్తున్నారు. నిన్న రాత్రి నుంచే ఆయన ఫోన్ అన్సర్ చేయకపోవడంతో మారుతీరావు భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆత్మహత్యకు కారణం మనస్తాపమే అయుండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. రెండేళ్ల కిందట కుమార్తె ప్రేమించిన ప్రణయ్ ని కిరాయి రౌడీలను పెట్టి ఆయనే హత్య చేయించారు. ఈ కేసులో ఆయన జైలుకి వెళ్లొచ్చారు. బెయిల్ మీద బయటకి వచ్చిన దగ్గర్నుంచీ కుమార్తె అమృతతో రాయబారం నడిపే ప్రయత్నం చేశారు. మధ్యవర్తులతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నించారు. ప్రణయ్ హత్య కేసులో తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పమనీ, ఈ కేసు నుంచి తనని బయటపడేయమనీ, కావాలంటే మొత్తం ఆస్తిని తనపేరున రాసి ఇస్తానంటూ కుమార్తెను ఒప్పించే ప్రయత్నం చేసినట్టు చెబుతున్నారు. ఇదే అంశమై అమృత కూడా కొద్దిరోజుల కిందట మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో మళ్లీ బెయిల్ మీద బయటకి వచ్చారు. ఈ కేసుకు సంబంధించిన పనుల కోసమే ఆయన హైదరాబాద్ కి వచ్చారని కుటుంబ సభ్యులు అంటున్నారు.
జైలుకి వెళ్లొచ్చిన దగ్గర్నుంచీ తన పరువంతా పోయిందనీ, మర్డర్ కేసు వల్ల బయట తలెత్తుకుని తిరగలేకపోతున్నారనీ, చాలారోజులుగా పూర్తి డిప్రెషన్లో ఆయన ఉన్నారని మారుతీరావు కుటుంబ సభ్యులు అంటున్నారు. దీన్లోంచి ఎలాగైనా బయటపడాలని ప్రయత్నిస్తున్నా… అన్ని దారులూ మూసుకుపోవడంతో చివరికి ఇలా ఆత్మహత్య చేసుకుని ఉంటారని చెబుతున్నారు. ఆయన సూసైడ్ నోట్ లాంటిది ఏమైనా పెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మొత్తానికి, కుటుంబమంతా ఛిన్నాభిన్నమైపోయింది!