ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. స్థానిక సంస్థల ఎన్నికలు .. ఒకేసారి గతంలో ఎప్పుడూ జరపలేదు. ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేవారు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేవారు. చివరిగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేవారు. అధికారయంత్రాంగం కూడా.. గందరగోళం లేకుండా ఆ ఎన్నికలు నిర్వహించేది. కానీ ఏపీ ప్రభుత్వం అసలు ఆగదల్చుకోలేదు. ఇరవై రోజుల్లో ఫటా ఫట్ నిర్వహించేయాలని డిసైడయింది. ఈ మేరకు షెడ్యూల్ ను ఖరారు చేసుకున్నారు. దీని కోసం టెన్త్ పరీక్షలను కూడా వాయిదా వేశారు.
రాజకీయ పార్టీలు ఈ వేగాన్ని అందుకోగలుగుతాయా.. అన్నదే అసలు చర్చ. అధికార పార్టీకి ఈ సమస్య లేదు. ఎందుకంటే.. ఎన్నికలు… ఎప్పుడు ఎలా పెట్టాలనే చాయిస్.. అనధికారికంగా అయినా ఆ పార్టీకి ఉంది కాబట్టి.. వారికి క్లారిటీ ఉంది. దాని తగ్గట్లే జెట్ స్పీడ్ ఎలక్షన్లకు వారు రెడీ అయిపోయారు. స్థానిక సంస్థల్లో 90 శాతం సీట్లు గెలవకపోతే.. పదవులు గల్లంతవుతాయని.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగానే… హెచ్చరికలు జారీ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇవి నేరుగా చెవికెక్కేశాయి. ఇక వారు తమ ఎలక్షనీరింగ్ పని తనం మొత్తం చూపించాల్సి ఉంటుంది. దీని కోసం వారం రంగంలోకి దిగిపోయారు. అధికార పార్టీ అనే అడ్వాంటేజ్‌ను పూర్తి స్థాయిలో ఉపయోగిచుకుంటున్నారు. అధికార పార్టీ కాబట్టి వ్యవస్థలన్నీ… దాసోమనడం సహజమే. ప్రస్తుత ప్రభుత్వంలో అది మరింత ఎక్కువనే విమర్శలున్నాయి.
ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతోంది. బీసీ రిజర్వేషన్లు… కరోనాను కారణంగా చూపిస్తోంది. అయితే.. పోరాటం విషయంలో వెనక్కి తగ్గకూడదనే ఆలోచనతో ఉంది. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా… వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకుంది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షానికి ఎన్నికల్లో పోటీ చేయడం సమస్య కాదు.. అధికార పార్టీ.. అధికారాన్ని ఎదుర్కోవడమే పెద్ద సవాల్. ఇక… భారతీయ జనతా పార్టీ – జనసేన పొత్తులు పెట్టుకున్నాయి. స్థానిక ఎన్నికల్లో కలిసి పని చేస్తామని ప్రకటన చేశాయి. ఆ తర్వాత రెండు పార్టీల కసరత్తు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఎన్నికల ప్రకటన వచ్చేసింది. నాలుగైదు రోజుల్లోనే ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలనేది ఖరారు చేసుకోవడమే కాదు.. నామినేషన్లు కూడా వేయించాల్సి ఉంది. జనసేన – బీజేపీకి అలాంటి క్యాడర్ లేదు. వారి మొదటి నుంచి.. అన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. స్థానిక ఎన్నికల సమరం… ఈ నెలంతా.. . ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వాతావరణం హీటెక్కనుంది. అది అలా ఇలా కాదు.. కేసులు.. గొడవలతో దద్దరిల్లే అవకాశం కనిపిస్తోంది.